Harish Rana: కారుణ్య మరణం పిటిషన్... తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Harish Rana Euthanasia Case Supreme Court Reserves Verdict
  • 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా
  • కొడుకుకు కారుణ్య మరణం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన తల్లిదండ్రులు
  • ఎవరి బతికి ఉండాలో, ఎవరు మరణించాలో నిర్ణయించలేమన్న సుప్రీంకోర్టు
13 సంవత్సరాలుగా జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన తన కుమారుడికి కారుణ్య మరణం అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు ధృవీకరించారని, మానవీయ కోణంలో గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతిరోజు ఎన్నో కేసులు విచారిస్తుంటామని, కానీ ఇది సున్నితమైన కేసు అని పేర్కొంది.

అయినా ఎవరు బతికి ఉండాలో, ఎవరు మరణించాలో నిర్ణయించేందుకు తామెవరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాము కూడా మనుషులమేనని పేర్కొంది. విచారణ ముగిసిన అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.

ఢిల్లీకి చెందిన 32 సంవత్సరాల హరీశ్ రాణా ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. 2013లో నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు గాయమై, శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. చికిత్స అందించినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. హరీశ్ అప్పటినుంచి కోమాలోనే ఉండటంతో, ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన తల్లిదండ్రులు కారుణ్య మరణానికి అనుమతించాలని 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Harish Rana
Karunya Maranam
Supreme Court
Euthanasia
Mercy Killing
Delhi High Court
Right to die

More Telugu News