Najmul Islam: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం: బోర్డు డైరెక్టర్ వ్యాఖ్యలపై ఆటగాళ్ల తిరుగుబాటు

Najmul Islam Bangladesh Cricket Crisis Player Revolt Over Board Director Comments
  • డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయకుంటే క్రికెట్ ను బహిష్కరిస్తామన్న ఆటగాళ్లు
  • తమీమ్ ఇక్బాల్‌ను 'ఇండియన్ ఏజెంట్' అని సంబోధించిన బోర్డు అధికారి
  • వరల్డ్ కప్ వేదిక వివాదం నడుస్తుండగానే కొత్త రచ్చ
  • బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు పొంచి ఉన్న ముప్పు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ వేదికల విషయంలో ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐలతో విభేదిస్తున్న బంగ్లా బోర్డుకు.. ఇప్పుడు స్వదేశీ ఆటగాళ్ల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, ఆయన రాజీనామా చేయకపోతే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లను బహిష్కరిస్తామని ఆటగాళ్లు అల్టిమేటం జారీ చేశారు.

ఇటీవల ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం, వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లడంపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు ఆటగాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది.

నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. ఇప్పటికే తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా తస్కిన్ అహ్మద్, మోమినుల్ హక్ వంటి సీనియర్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో గళమెత్తారు.

పరిస్థితి చేయిదాటుతుండటంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నష్టనివారణ చర్యలు చేపట్టింది. నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలతో బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని ప్రకటించింది. ఆటగాళ్ల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినప్పటికీ, నజ్ముల్ రాజీనామాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆటగాళ్లు తమ పంతం వీడటం లేదు. గురువారం మధ్యాహ్నం లోపు డైరెక్టర్ రాజీనామా చేయాలని ఆటగాళ్లు గడువు విధించారు. ఒకవేళ బోర్డు దిగిరాకపోతే బంగ్లాదేశ్ క్రికెట్ స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
Najmul Islam
Bangladesh cricket
BCB
Tamim Iqbal
BPL
Bangladesh Premier League
cricket crisis
player revolt
Taskin Ahmed
Mominul Haque

More Telugu News