Indigo: గగనతలం మూసివేతకు ముందు.. ఇరాన్ గగనతలంలో చివరి విమానం మన 'ఇండిగో'నే!

Indigo Last Plane Before Iran Airspace Closure
  • జార్జియా నుంచి వస్తుండగా ఇరాన్ గగనతలం క్లోజ్
  • త్రుటి తప్పిన ముప్పు
  • ప్రయాణికులు సురక్షితం
  • రూట్ మార్చుకున్న విమానాలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ తన గగనతలాన్ని హఠాత్తుగా మూసివేసింది. అయితే, ఈ మూసివేత ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇరాన్ గగనతలంలో ప్రయాణించిన చివరి అంతర్జాతీయ విమానంగా మన దేశానికి చెందిన 'ఇండిగో' నిలిచింది. జార్జియాలోని టిబిలిసి నుంచి వస్తున్న ఈ విమానం ఇరాన్ తన బోర్డర్లను మూసివేయడానికి సరిగ్గా నిమిషాల ముందు ఆ గగనతలాన్ని దాటి బయటకు వచ్చేసింది.

ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం.. ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించే సమయానికి చాలా విమానాలు తమ మార్గాలను మళ్లించుకున్నాయి. కానీ, ఇండిగోకు చెందిన 6E-1808 విమానం అప్పటికే ఇరాన్ గగనతలంలో ఉంది. ఆ సమయంలో ఇరాన్ భూభాగంపై ఉన్న ఏకైక 'నాన్-ఇరానియన్' విమానం ఇదే. సరైన సమయంలో అది ఇరాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ గగనతంలోకి ప్రవేశించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురవుతున్న హెచ్చరికలు, ఇరాన్ అంతర్గత అశాంతి నేపథ్యంలో టెహ్రాన్ తన గగనతలాన్ని శత్రు విమానాలకు దొరక్కుండా మూసివేసింది. కమర్షియల్ విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ గగనతంలో జరిగిన విమాన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి.

ఇరాన్ గగనతలం మూసివేతతో భారత్ నుంచి యూరప్, అమెరికా వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా సహా పలు సంస్థలు తమ విమానాలను ఇప్పుడు ఇరాన్ మీదుగా కాకుండా అరేబియా సముద్రం లేదా మధ్య ఆసియా దేశాల మీదుగా సుదీర్ఘ మార్గంలో మళ్లించాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన భారం కూడా పెరగనుంది.  

ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం అనిశ్చితంగా ఉన్నందున, భారత విమానయాన శాఖ (DGCA) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రయాణికులు తమ విమాన సమయాలను సరిచూసుకోవాలని సూచించింది. 
Indigo
Iran airspace
Iran
6E-1808
flight diversion
Air India
DGCA
aviation safety
India Europe flights
travel advisory

More Telugu News