Harish Raana: మరణానికి అనుమతినివ్వండి: 13 ఏళ్ల నరకం నుంచి కుమారుడికి విముక్తి కోరుతూ సుప్రీం మెట్లెక్కిన తల్లిదండ్రులు

Harish Raana Parents Seek Euthanasia for Son in Supreme Court
  • 13 ఏళ్లుగా 'వెజిటేటివ్' స్థితిలో హరీశ్ రాణా
  • ట్యూబ్‌ల ద్వారానే శ్వాస, ఆహారం
  • భారత్‌లో 'పాసివ్ యుథనేసియా'పై నేడు సుప్రీం కోర్టు తుది తీర్పు
  • గౌరవప్రదంగా మరణించే హక్కుపై దేశవ్యాప్త ఉత్కంఠ
  • కోలుకునే అవకాశం లేదని తేల్చేసిన మెడికల్ బోర్డు
  • 2013లో భవనంపై నుంచి పడడంతో ప్రమాదం
గడచిన 13 ఏళ్లుగా అటు బతకలేక, ఇటు ప్రాణంపోక మంచానికే పరిమితమైన తన కొడుకును కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా తల్లిదండ్రులు చేసిన అభ్యర్థనపై నేడు (గురువారం) సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ తీర్పు 2018లో నిష్క్రియ కారుణ్య మరణం (Passive Euthanasia జీవనాధార చికిత్సను తొలగించడం) చట్టబద్ధమైన తర్వాత దేశంలోనే అత్యంత కీలకమైన మైలురాయి కానుంది.

2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీశ్ రాణా తన పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయమై 100 శాతం అశక్తుడిగా మారాడు. అప్పటి నుంచి హరీశ్ కళ్లు తెరవలేడు, అవయవాలు కదపలేడు. కేవలం ట్యూబ్‌ల ద్వారా శ్వాస పీలుస్తూ, ఆహారం తీసుకుంటూ జీవచ్చవంలా పడి ఉన్నాడు. కొడుకు చికిత్స కోసం ఆ తల్లిదండ్రులు తమ ఇల్లు అమ్ముకుని ఆర్థికంగా చితికిపోయారు.

హరీశ్‌ను ఇలాంటి నరకప్రాయమైన స్థితి నుంచి విముక్తుడిని చేయాలని అతడి తల్లిదండ్రులు 2024లో మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హరీశ్ వెంటిలేటర్ మీద లేడనే కారణంతో అప్పట్లో కోర్టు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా పరిస్థితిని సమీక్షించిన న్యాయస్థానం ఇద్దరు సభ్యుల మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. హరీశ్ కోలుకునే అవకాశం లేదని, అతడి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని బోర్డు నివేదిక ఇచ్చింది.

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం హరీశ్ తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడింది. "ఈ బాలుడిని ఇలాంటి స్థితిలో ఉంచలేం" అని కోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించి, హరీష్‌కు గౌరవప్రదంగా కన్నుమూసే హక్కును కల్పిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కాగా, అరుణా షాన్‌బాగ్ కేసులో 2011లో సుప్రీంకోర్టు మొదటిసారి కారుణ్య మరణంపై చర్చ ప్రారంభించింది. 2018లో 'గౌరవప్రదంగా మరణించడం కూడా జీవించే హక్కులో భాగమే' అని తీర్పునిస్తూ పాసివ్ యూథనేసియాను చట్టబద్ధం చేసింది. 
Harish Raana
passive euthanasia
supreme court
mercy killing
right to die
Aruna Shanbaug case
delhi high court
medical board
life support

More Telugu News