Maoists: పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు

Maoists Surrender in Large Numbers in Sukma Chhattisgarh
  • పోలీసుల సమక్షంలో లొంగిపోయిన గోగుండ ప్రాంతానికి చెందిన 29 మంది మావోయిస్టులు 
  • లొంగిపోయిన పొడియం బుధ్రాపై రూ.2 లక్షల రివార్డు ఉందన్న పోలీసులు 
  • మావోయిస్టుల పునరావాసం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయన్న సుక్మా ఎస్పీ కిరణ్  
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గోగుండ ప్రాంతానికి చెందిన 29 మంది మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘం (డీఏకేఎమ్ఎస్) నేత పొడియం బుధ్రా సహా డీఏకేఎమ్ఎస్, 'జనత సర్కార్ వింగ్‌'కు చెందిన సభ్యులు ఇతర మావోయిస్టులతో కలిసి ఆయుధాలను పోలీసులకు అప్పగించి లొంగిపోయారు. లొంగిపోయిన పొడియం బుధ్రాపై రూ.2 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. మావోయిస్టుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా అనేక మంది మావోయిస్టులు ఆయుధాలు త్యజించి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని తెలిపారు. నక్సలిజాన్ని విడిచిపెట్టి సాధారణ జీవనాన్ని అవలంబించాలని ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు.

కొంతకాలంగా లొంగుబాట్లు పెరుగుతున్న నేపథ్యంలో గోగుండ ప్రాంతం (దర్భా డివిజన్)లో మావోయిస్టు ఉద్యమ ప్రభావం గణనీయంగా తగ్గినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గోగుండలో సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటు చేసిన తర్వాత మావోయిస్టుల కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని, వారి మద్దతుదారుల నెట్‌వర్క్ బలహీనపడడంతో లొంగుబాట్లు పెరిగాయని అధికారులు వెల్లడించారు.

ఈ నెల 8న దంతేవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోగా, అంతకుముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది సరెండర్ అయ్యారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. 
Maoists
Chhattisgarh
Sukma
Podiyam Budhra
Surrender
Naxalism
Gogunda
Dantewada
Naxalite movement
anti-naxal operations

More Telugu News