కేసీ పాఠశాల శత వసంత వేడుకలు.. స్ఫూర్తి నింపిన పూర్వవిద్యార్థిని, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారిణి పోలూరి రాజేశ్వరి

  • గుంటూరు జిల్లా కొత్త రెడ్డిపాలెంలో కేసీ పాఠశాల శత వసంత వేడుకలు
  • గౌరవ అతిథిగా విచ్చేసిన పూర్వ విద్యార్థిని, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారిణి పోలూరి రాజేశ్వరి 
  • తన ఎదుగుదలకు పాఠశాలే పునాది అని గుర్తుచేసుకున్న రాజేశ్వరి
  • ఉద్యోగంలో చేరిన రెండో రోజే 89 మంది స్మగ్లర్లను పట్టుకున్న ఘనత ఆమెది
  • విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయక సందేశం
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో కేసీ (కొండవీటి కమిటీ) పాఠశాల శత వసంత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యాభివర్ధని సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు పాఠశాల పూర్వ విద్యార్థిని, రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారిణి పోలూరి రాజేశ్వరి గౌరవ అతిథిగా విచ్చేశారు. సరస్వతీ దేవి విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 

ఉద్యోగంలో చేరిన రెండో రోజే 89 మంది స్మగ్లర్లను పట్టుకున్న ఘనత ఆమెది. ఈ కార్యక్రమంలో ఆమె స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. "మనందరితో తొలి అడుగులు వేయించి, మనలను బతుకు బాటలో నిలబెట్టింది ఈ కేసీ పాఠశాల. అలాంటి నూరు వసంతాల ఈ పాఠశాలలో నా ప్రయాణం 10 సంవత్సరాలు. మొదట ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఓర్పుతో, సృజనాత్మకతో విద్యాబోధన చేసి, మమ్మల్ని తదుపరి చదువుల కోసం ఉన్నత పాఠశాలకు పంపారు. అప్పుడు హేమాహేమీలైన ఉపాధ్యాయులు ఉండేవారు. ఆ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది మా పురోభివృద్ధికి బాటలు వేశారు. ఈ పాఠశాల మాకు పాఠ్యపుస్తకాలను మించి బయటి ప్రపంచాన్ని పరిశీలించడం, అభివృద్ధి పథాన్ని అనుసరించడం నేర్పించింది. 

ఇతర పెద్ద పాఠశాలలకు కూడా లేని విధంగా, మా పాఠశాలకు ఓ గొప్పదనం ఉంది. ఇక్కడి పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ రచన పోటీలు నిర్వహించడం ద్వారా, వారి గొంతుకను నిర్భయంగా వినిపించేలా తీర్చిదిద్దింది. సైన్ప్, గణితం వంటి సబ్జెక్టులే కాకుండా, ఒక ఆవిష్కరణాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవడం ఇక్కడ్నించే మొదలైంది. ఏదైనా సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేస్తే మాకు పండగే. ప్రసాదరావు మాస్టారు, దుష్యంత్ రెడ్డి మాస్టారు, సాంబశివరావు మాస్టారు మొదలైన ఉపాధ్యాయులు ఉత్సాహవంతులైన పిల్లలను ఎంపిక చేసి, వారిని సైన్స్ ఫెయిర్ కు తీసుకెళ్లి అనేక ప్రథమ బహుమతులు వచ్చేలా కృషి చేశారు. కేసీ హైస్కూల్లో ఎగ్జిబిషన్ జరుగుతుందంటే న్యాయనిర్ణేతలు వెతుక్కుంటూ వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. 

ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి ఒడుదుడుకుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ఈ పాఠశాల మాకు నేర్పించింది. అందుకే ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఇంజినీర్లు, వైద్యులుగా విదేశాల్లో ఉన్నారు. అందుకే ఇటువంటి పాఠశాలలు ప్రతి చోటా ఉండాలి. విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలి. మమ్మల్ని ఇంత ఉన్నతస్థాయిలో నిలిపిన పాఠశాలకు శతాభివందనాలు. పాఠశాల పూర్వ యాజమాన్యానికి, ఇప్పటి యాజమాన్యానికి కృతజ్ఞతలు" అని పోలూరి రాజేశ్వరి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

విద్యార్థులకు నా విజ్ఞప్తి:
విద్యే ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆయుధం. అలుపు లేకుండా నేర్చుకోండి.
మిమ్మల్ని మీరు నమ్మండి, మీలో గొప్ప శక్తి ఉంది.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి.

ఉపాధ్యాయులకు నా విన్నపం:
విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి.
ధనం కోసం వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టని వ్యక్తులను తయారు చేయండి.
తాము నమ్మిన సత్యం కోసం పోరాడే పటిమను విద్యార్థులలో నింపండి.

ఈ శుభ సందర్భంగా, నన్ను తీర్చిదిద్దిన గురువులకు, నాతో నడిచిన స్నేహితులకు, నాకు సహకరించిన కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు.. అంటూ ఓ సందేశం కూడా వెలువరించారు.

ఒకేసారి 89 మంది స్మగ్లర్లను పట్టుకుని సంచలనం సృష్టించిన రాజేశ్వరి

పోలూరి రాజేశ్వరి. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఒకేసారి 89 మంది గంధపు చెక్కల స్మగ్లర్లను పట్టుకుని సంచలనం సృష్టించిన అధికారిణిగా ఆమె సుపరిచితులు. పర్యావరణ పరిరక్షణపై ఉన్న మక్కువతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

గుంటూరు జిల్లా కొత్త రెడ్డిపాలెం అనే చిన్న గ్రామంలో రాజేశ్వరి జన్మించారు. ఆమె తండ్రి ప్రసాదరావు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆమె కేసీ హైస్కూల్ లో 10వ తరగతి వరకు చదివారు. గుంటూరులో బీఎస్సీ బోటనీ, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీ పూర్తిచేశారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో గ్రూప్-1 ఉద్యోగం వచ్చినా వదులుకుని, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) వైపు అడుగులు వేశారు. శిక్షణ అనంతరం తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం రేంజ్‌లో తొలి పోస్టింగ్ అందుకున్నారు. విధుల్లో చేరిన రెండో రోజే సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి, 1.5 టన్నుల గంధపు చెక్కలతో పాటు 89 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమిళనాడు చరిత్రలోనే ఇది ఒక రికార్డు. ఒకేసారి అంతమంది స్మగ్లర్లను పట్టుకోవడం అంతకుముందెప్పుడూ జరగలేదు. 

ఉద్యోగ విధి నిర్వహణలో ఆమె ప్రస్థానం పూలపాన్పు కాలేదు. స్మగ్లర్ల నుంచి ప్రాణహాని ఉన్నా వెరవకుండా పనిచేశారు. ఓ సందర్భంలో స్మగ్లర్లు వాహనంతో ఢీకొట్టి ఫారెస్ట్ వాచర్‌ను చంపినప్పుడు, అర్ధరాత్రి సమయంలోనూ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ సమయంలో తన ఆరు నెలల పాపను సైతం ఇంట్లో వదిలి విధి నిర్వహణకు ప్రాధాన్యమిచ్చారు. స్మగ్లింగ్ ముఠాల ఆటకట్టించేందుకు వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయించి కఠినంగా వ్యవహరించారు.

ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికాలోని ‘ఘనా’ దేశంలో పర్యటించి అక్కడి పేదరిక నిర్మూలన పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని తమిళనాడులో విజయవంతంగా అమలు చేశారు. పోలూరి రాజేశ్వరి అటవీశాఖలో అదనపు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (వైల్డ్‌లైఫ్‌)గా పనిచేస్తుండగా, ఆమెకు తమిళనాడు ప్రభుత్వం డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించింది. చివరగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గానూ, తమిళనాడు ఫారెస్ట్ ప్లాంటేషన్ కార్పొరేషన్ కు చైర్మన్ గానూ పనిచేశారు. ఆ తర్వాత పదవీ విరమణ చేశారు. 

ఆమె భర్త బండ్లమూడి సింగయ్య కూడా ఉన్నతాధికారిగా సేవలు అందించారు. ఆయన ఐఆర్ఏస్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎమ్)లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ, పదవీ విరమణ చేశారు.


More Telugu News