Seethakka: ములుగు జిల్లాను తొలగిస్తున్నారని ప్రచారం... స్పందించిన మంత్రి సీతక్క

Seethakka responds to Mulugu district removal rumors
  • ములుగు జిల్లాను తొలగిస్తారనే ప్రచారాన్ని విశ్వసించవద్దన్న మంత్రి
  • పలు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని విమర్శ
  • జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
ములుగు జిల్లాను తొలగిస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై మంత్రి సీతక్క స్పందించారు. తెలంగాణలో ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం చర్చకు దారి తీసింది. వివిధ జిల్లాలు రద్దవుతున్నాయంటూ ఆయా జిల్లాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ ప్రచారాన్ని ఆయా జిల్లాలకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. జనగామ జిల్లా రద్దవుతోందంటూ రెండు రోజుల క్రితం ప్రచారం జరగగా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. తాజాగా ములుగు జిల్లాపై అలాంటి ప్రచారం సాగుతోంది.

ములుగు జిల్లాను తొలగిస్తున్నారని జరుగుతోన్న ప్రచారాన్ని విశ్వసించవద్దని మంత్రి సీతక్క అన్నారు. పలు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా జిల్లాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అందుకే మరోసారి జిల్లాల పునర్విభజన గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆమె తెలిపారు. ఎందరో పోరాటాలు, త్యాగాల వల్ల ములుగు జిల్లా ఏర్పడిందని అన్నారు.
Seethakka
Mulugu district
Telangana districts
District reorganization
Revanth Reddy
BRS party

More Telugu News