Nara Lokesh: భోగి వేళ... నారావారిపల్లెలో మంత్రి లోకేశ్ 81వ రోజు ప్రజాదర్బార్

Nara Lokesh Holds Praja Darbar on Bhogi at Naravaripalle
  • పెద్దఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించిన ప్రజలు
  • భూ వివాదాలు, ఉద్యోగ సమస్యలు, టీటీడీ విధానాలపై పలు విజ్ఞప్తులు
  • అందిన వినతులను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
  • ప్రతి ఒక్కరినీ పలకరించి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం 81వ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో భోగి పండుగ రోజున (బుధవారం) ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పండుగ పూట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ను కలిసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేశ్, వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు.

ప్రజాదర్బార్‌లో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ సమస్యలు, స్థానిక అవసరాలపై వినతులు వెల్లువెత్తాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన పత్తి శివకుమార్, తమకు వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అలాగే, రామసముద్రం మండలం బలిజపల్లికి చెందిన కె. పార్వతి, తమ రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన పలు అంశాలపై కూడా మంత్రికి విజ్ఞప్తులు అందాయి. తిరుమలలో అంగప్రదక్షణ కోసం ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, భక్తుల సౌలభ్యం కోసం గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్ టోకెన్లు జారీ చేయాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు కోరారు. అదేవిధంగా, టీటీడీలో సొసైటీ విధానంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇతర ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయం, శ్రీవారి దర్శనం కల్పించాలని సిబ్బంది విన్నవించుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం తమ గోడును మంత్రి లోకేశ్ ముందు వెళ్లబోసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో తొలగించిన 160 మంది కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ సూపర్‌వైజర్లకు తిరిగి ఉద్యోగావకాశం కల్పించాలని ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కాంట్రాక్ట్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. 

తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న 150 ఎస్టీ ఎరుకల కుటుంబాలకు ఒకేచోట ఇళ్ల స్థలాలు కేటాయించాలని శ్రీ వేంకటేశ్వర ఎస్టీ ఎరుకల సంఘం విజ్ఞప్తి చేసింది. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కచ్చరావేడు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరారు.

అందిన ప్రతి వినతిని ఓపికగా పరిశీలించిన మంత్రి లోకేశ్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు.
Nara Lokesh
Andhra Pradesh
Praja Darbar
Naravaripalle
Chandrababu Naidu
TDP
Public Grievances
Tirupati
Bhogi Festival
Land Disputes

More Telugu News