Aditya Prakash: అమెరికా వర్సిటీలో పాలక్ పనీర్‌పై వివక్ష.. 1.8 కోట్ల దావా గెలిచిన ఇండియన్ స్టూడెంట్స్

Aditya Prakash Wins 18 Million Lawsuit Against US University
  • పాలక్ పనీర్ వివాదంలో భారత విద్యార్థుల విజయం
  • యూఎస్ వర్సిటీ నుంచి రూ. 1.8 కోట్ల పరిహారం  
  • వివక్ష, ప్రతీకార చర్యలపై న్యాయపోరాటం చేసిన విద్యార్థులు
  • సెటిల్‌మెంట్‌లో భాగంగా మాస్టర్స్ డిగ్రీలు పొందిన జంట
అమెరికాలో జాతి వివక్షపై ఇద్దరు భారతీయ పీహెచ్‌డీ విద్యార్థులు చేసిన న్యాయపోరాటం ఫలించింది. తాము తెచ్చుకున్న భోజనం వాసనపై మొదలైన వివాదంలో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌పై వారు వేసిన కేసులో విజయం సాధించారు. సెటిల్‌మెంట్‌లో భాగంగా వర్సిటీ నుంచి 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.8 కోట్లు) పరిహారం పొందారు.

వివరాల్లోకి వెళితే, భోపాల్‌కు చెందిన ఆదిత్య ప్రకాశ్ (34), కోల్‌కతాకు చెందిన ఊర్మి భట్టాచార్య (35) కొలరాడో యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2023 సెప్టెంబర్ 5న ఆదిత్య ప్రకాశ్ తన లంచ్ బాక్సులోని పాలక్ పనీర్‌ను డిపార్ట్‌మెంట్ మైక్రోవేవ్‌లో వేడి చేసుకుంటుండగా,  సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దాని వాసన ఘాటుగా ఉందని, ఇక్కడ వేడి చేయవద్దని సూచించారు.

ఈ ఘటనపై ఆదిత్య, ఊర్మి వివక్షగా భావించి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి యూనివర్సిటీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. తమను మానసికంగా వేధించారని, ఎలాంటి కారణం లేకుండా ఊర్మిని టీచింగ్ అసిస్టెంట్ పదవి నుంచి తొలగించారని తెలిపారు. దక్షిణాసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకునేలా కిచెన్ నిబంధనలు ఉన్నాయని పేర్కొంటూ, 2025 మే నెలలో యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు.

ఈ కేసు విచారణ అనంతరం 2025 సెప్టెంబర్‌లో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, విద్యార్థులకు 2 లక్షల డాలర్ల పరిహారంతో పాటు మాస్టర్స్ డిగ్రీలు ప్రదానం చేసేందుకు వర్సిటీ అంగీకరించింది. అయితే, భవిష్యత్తులో వారు అదే యూనివర్సిటీలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వీల్లేకుండా నిబంధన విధించింది. దీంతో తమ పీహెచ్‌డీలను మధ్యలోనే వదిలేసి, ఇటీవల విద్యార్థులు భారత్‌కు తిరిగి వచ్చారు.

"నా ఆహారం నా గర్వకారణం. ఏది మంచి వాసన, ఏది చెడు వాసన అనేది సార్వత్రికం కాదు, అది సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది" అని ఆదిత్య ప్రకాశ్ పేర్కొన్నారు. "ఇలాంటి 'ఫుడ్ రేసిజం'ను సవాలు చేయవచ్చనే సందేశం వెళితే, అదే అసలైన విజయం" అని ఆయన అన్నారు.
Aditya Prakash
University of Colorado Boulder
Indian students
palak paneer
food racism
discrimination lawsuit
Urmi Bhattacharya
racial discrimination
Indian cuisine
settlement

More Telugu News