KTR: కొలంబియా గ్లోబల్ బిజినెస్ స్కూల్ నుంచి కేటీఆర్ కు మరో గ్లోబల్ ఆహ్వానం
- ఏప్రిల్ 4న జరిగే ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించాలని ఆహ్వానం
- గత 21 ఏళ్లుగా న్యూయార్క్ లో జరుగుతున్న కాన్ఫరెన్స్
- ఇటీవలే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ కు కూడా కేటీఆర్ కు ఆహ్వానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్ లో ఏప్రిల్ 4న జరిగే 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించాలని ఆయనకు ఆహ్వానం అందింది.
ఈ సదస్సును సౌత్ ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ (SABA) విద్యార్థి విభాగం నిర్వహిస్తోంది. గత 21 ఏళ్లుగా న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే భారతదేశ వ్యాపారం, ఆవిష్కరణలు, విధానాలు, సుస్థిర అభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై మేధోమధనం జరిగే అత్యున్నత వేదికల్లో ఒకటి. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులు కలిసి గ్లోబల్ ఎకానమీలో భారత్ పాత్రను చర్చించే ప్రతిష్ఠాత్మక ఈవెంట్ ఇది.
కేటీఆర్ మంత్రిగా చేసిన కృషి, తెలంగాణను ప్రపంచ పటంలో సమున్నత స్థాయికి తీసుకెళ్లిన విజన్, సాంకేతికత, పాలన, ఆర్థిక వృద్ధిపై ఆయనకున్న లోతైన అవగాహన కారణంగానే ఈ ఆహ్వానం వచ్చినట్టు సమాచారం. కేటీఆర్‌ను విశిష్ట వక్తగా పిలవడం తమకు గౌరవంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది కాన్ఫరెన్స్‌లో జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రధాన వక్తగా ఉంటారు. గతంలో పియూష్ గోయల్, నికేశ్ అరోరా, హర్ష్ జైన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై మాట్లాడారు. ఇటీవలే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌కు కూడా ఆహ్వానం అందిన కేటీఆర్, గత ఏడాది ఆక్స్ఫర్డ్ ఇండియా వీక్‌లో ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు.