Trump tariffs: టారిఫ్ లపై సుప్రీం తీర్పు వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump on Supreme Court Ruling on Tariffs
  • సుంకాలు ఆపేయాలని తీర్పు వస్తే ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు
  • తాను విధించిన టారిఫ్ ల వల్లే ద్రవ్యలోటు తగ్గిందని వెల్లడి
  • అమెరికన్లపై భారం పడుతోందన్న వాదన అర్థరహితమన్న ట్రంప్
ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ ల విధానాలతో అంతిమంగా అమెరికన్లకే నష్టమంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై అక్కడి అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అతిక్రమించారా.. లేదా? అనేది కోర్టు నిర్ణయించనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను విధించిన సుంకాలతో తక్కువ సమయంలోనే అమెరికా ద్రవ్యలోటు తగ్గిందని అన్నారు. టారిఫ్ ల వల్ల దేశంలో వినిమయ ఖర్చులు పెరిగాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తన మార్గాలు తనకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని స్పష్టం చేశారు.

విమర్శకులపై మండిపడ్డ ట్రంప్..
టారిఫ్ లను అడ్డుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారు చైనా ప్రయోజనాల కోసమే తపన పడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. సుంకాలతో అమెరికన్లకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. సుంకాల భారం విదేశాలపైనే మోపుతున్నామని, దేశంలో వినిమయ ఖర్చులు పెరిగాయన్న వాదన అర్థరహితమని కొట్టిపారేశారు. ఫెడరల్ బడ్జెట్ ద్రవ్యలోటును తగ్గించడానికి తన టారిఫ్ ల విధానం ఉపయోగపడుతోందన్నారు.

అతి తక్కువ కాలంలోనే ద్రవ్యలోటు 27 శాతం వరకు తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్ లు విధించాలన్న తన నిర్ణయం ముమ్మాటికీ సరైనదేనని చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు వసూలు చేసిన టారిఫ్ లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్ చెప్పారు.
Trump tariffs
US Supreme Court
tariffs policy
Donald Trump
US deficit
international emergency economic powers act
US consumption
China
federal budget

More Telugu News