RTC bus accident: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. 27 మందికి గాయాలు

RTC Bus Accident 27 Injured in Mahbubnagar Collision
  • మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో జాతీయ రహదారిపై ఘటన
  • హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైన వైనం
  • డీసీఎం వ్యాన్ షడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం
పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన సంభవించింది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వస్తున్న బస్సు అదుపు తప్పి డీసీఎంను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడగా, బస్సులోని ప్రయాణికుల్లో 27 మందికి పైగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. గాయపడిన వారందరికీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. 
RTC bus accident
Mahbubnagar
Telangana road accident
Jadcherla
Kurnool
Hyderabad
Road accident
Bus collision
National Highway 44
N B Ratnam

More Telugu News