Rajkumari Indira Devi: ప్రముఖ రచయిత్రి రాజకుమారి ఇందిరాదేవి కన్నుమూత

Rajkumari Indira Devi Renowned Writer Passes Away
  • హైదరాబాద్‌లోని గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో కన్నుమూసిన రచయిత్రి రాజకుమారి ఇందిరాదేవి
  • బహుముఖ ప్రతిభతో సాహిత్య, కళా రంగాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇందిరాదేవి
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీకి తొలి అధ్యక్షురాలిగా, ఉర్దూ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన ఇందిరాదేవి
ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, రచయిత్రి, దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) హైదరాబాద్‌లోని గోషామహల్‌ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య, కళా రంగాలలో ఆమె చెరగని ముద్ర వేశారు.

అల్లా ఇక్బాల్‌, గాలీబ్‌, అరబిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి చిన్న వయస్సు నుంచే సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారు. యుక్తవయసులోనే ఫొటోగ్రఫీపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని, ఫొటోల సేకరణను ప్రారంభించారు.

1964లో ఆమె తొలి కవితా సంపుటి ‘ది అపోసల్‌’ పేరుతో వెలువడింది. ఆ తర్వాత 1965, 1966 సంవత్సరాల్లో వరుసగా మరికొన్ని పుస్తకాలు ప్రచురితమై పాఠక లోకంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీకి తొలి అధ్యక్షురాలిగా, ఉర్దూ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించి భాషా సాహిత్యాల అభివృద్ధికి విశేషంగా సేవలందించారు.

సాహిత్య రంగంలో ఆమె సాధించిన విశిష్టతకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. 1973లో ప్రపంచ పోయెట్రీ సొసైటీ ఇంటర్‌కాంటినెంటల్‌ (డబ్ల్యూపీఎస్‌ఐ) అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్‌ ఆమె పేరును సాహిత్యంలో నోబెల్‌ బహుమతికి నామినేట్‌ చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా రాజకుమారి ఇందిరాదేవి చరిత్రలో నిలిచారు. 
Rajkumari Indira Devi
Indira Devi
Gunturu Seshendra Sharma
Telugu writer
poet
Hindi Academy
Urdu Academy
Hyderabad
Indian literature
Nobel Prize nomination

More Telugu News