Ali Larijani: ఇరాన్‌లో ఆగని రక్తపాతం: ట్రంప్, నెతన్యాహూలే అసలు హంతకులు: ఇరాన్ సంచలన ఆరోపణ

Iran accuses Trump and Netanyahu of being murderers
  • నిరసనల్లో 2,400 మందికి పైగా మృతి.. 18 వేల మంది అరెస్ట్
  •  నిరసనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరిక 
  • హింసను ప్రేరేపిస్తున్నారంటూ ఐక్యరాజ్యసమితికి ఇరాన్ ఫిర్యాదు 
  • ఇరాన్ అధికారులతో చర్చలను రద్దు చేసిన అమెరికా అధ్యక్షుడు
ఇరాన్‌లో రోజురోజుకూ ముదురుతున్న అంతర్గత నిరసనలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన యుద్ధానికి దారితీశాయి. దేశంలో కొనసాగుతున్న హింసాత్మక అణిచివేతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారీజానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్న అసలైన హంతకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహూలేనని ఆయన ధ్వజమెత్తారు. వాషింగ్టన్, టెల్ అవీవ్‌లే ఈ అల్లర్లను వెనకుండి నడిపిస్తున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఇప్పుడు ప్రభుత్వ ఉనికికే సవాలుగా మారాయి. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) గణాంకాల ప్రకారం ఇప్పటివరకు జరిగిన హింసలో 12 మంది మైనర్లు సహా మొత్తం 2,403 మంది మరణించారు. సుమారు 18,137 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిరసనకారుల మరణాలపై ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ స్పందిస్తూ దేశంలో చాలా మంది 'అమరవీరులు' అయ్యారని తొలిసారిగా అంగీకరించింది. ఈ క్రమంలోనే, నిరసనకారులను గనుక ప్రభుత్వం ఉరితీస్తే తాము ఊరుకోబోమని, చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నారని ఇరాన్ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. నిరసనకారులను రెచ్చగొడుతూ, హింసను ప్రేరేపిస్తున్నారని ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ ఐరాస భద్రతా మండలికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ అధికారులతో జరగాల్సిన అన్ని సమావేశాలను ట్రంప్ ఇప్పటికే రద్దు చేసుకున్నారు. "సహాయం అందుతుంది, పోరాటం కొనసాగించండి" అంటూ ట్రంప్ చేసిన 'ట్రూత్ సోషల్' పోస్ట్ ఇప్పుడు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేసింది. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ, టెహ్రాన్ మాత్రం ఆ దిశగా ఎటువంటి నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. 
Ali Larijani
Iran protests
Donald Trump
Benjamin Netanyahu
Iran unrest
US Iran relations
Iran Human Rights
Iran political crisis
Iran sanctions
Iran news

More Telugu News