Vadhavath Renuka: రూ. లక్ష కోసం ఆడబిడ్డను విక్రయించిన దంపతులు

Rangareddy Couple Sells Newborn for 1 Lakh Rupees
  • రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలో వెలుగుచూసిన దారుణం
  • అంగన్‌వాడీ కేంద్రానికి రాకపోవడంతో ఆరా తీసిన అధికారులు
  • 'ఆపరేషన్ స్మైల్' ద్వారా పసికందును రక్షించిన పోలీసులు
  • మధ్యవర్తి ద్వారా హైదరాబాద్ కుటుంబానికి విక్రయం
పేదరికమో లేదా ఆడపిల్లనే భారమనుకున్నారో కానీ, కన్న పేగు బంధాన్ని తెంచుకుని ఆ పసికందును విక్రయించిందో జంట. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లాల్సింగ్ తండాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ శిశు విక్రయ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.  

లాల్సింగ్ తండాకు చెందిన వాడ్యావత్ రేణుక గతేడాది నవంబరు 9న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తుంది. అయితే, జనవరి 1 నుంచి రేణుక కేంద్రానికి రాకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్త చింటుకు అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు 'ఆపరేషన్ స్మైల్' టీంతో కలిసి విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

ఇన్ముల్ నర్వ గ్రామానికి చెందిన గోవింద్ అనే మధ్యవర్తి ద్వారా రేణుక దంపతులు తమ బిడ్డను హైదరాబాద్‌కు చెందిన ఒక కుటుంబానికి విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ బేరం సుమారు లక్ష రూపాయలకు కుదిరినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి శిశువును స్వాధీనం చేసుకుని, సురక్షితంగా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమంలో భాగంగా పోలీసులు తప్పిపోయిన పిల్లలు, బాలకార్మికులు, అక్రమ రవాణాకు గురైన శిశువులను గుర్తిస్తున్నారు. ఈ కేసులో మధ్యవర్తి గోవింద్‌తో పాటు, బిడ్డను కొనుగోలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 
Vadhavath Renuka
child selling
Rangareddy district
Farooqnagar
Lalsingh Thanda
Operation Smile
child trafficking
poverty
Hyderabad

More Telugu News