ఆరెస్సెస్ ప్రతినిధులతో సమావేశమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బృందం

  • ఢిల్లీలోనిప్రేరణ బ్లాక్‌లోని ఆరెస్సెస్ సభ్యులతో సమావేశం
  • ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అన్న చైనా బృందం
  • మోహన్ భాగవత్ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదన్న ఆరెస్సెస్ ప్రతినిధులు
చైనా బృందం నేడు ఆరెస్సెస్ ప్రతినిధులతో సమావేశమైంది. నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన చైనా బృందం... ఇవాళ ఢిల్లీలోని ప్రేరణ బ్లాక్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులతో భేటీ అయింది. షక్సాగామ్ లోయపై చైనా, భారత్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ భద్రతాంశాల్లో చైనాతో ఇలాంటి సంప్రదింపులు సరికాదని పేర్కొంది.

ఆరెస్సెస్ వర్గాల ప్రకారం, చైనా ప్రతినిధి బృందం ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేను కలిసింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని తెలిపాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) విజ్ఞప్తి మేరకు గంటసేపు సమావేశమైనట్లు వెల్లడించాయి.

"ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు. చైనా ప్రతినిధి బృందం దత్తాత్రేయ హోసబలేను కలిసింది. ఈ సమావేశానికి నిర్దిష్ట అజెండా ఏమీ లేదు" అని ఆరెస్సెస్ ప్రతినిధులు తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, పాకిస్థాన్, టర్కీ, చైనా దేశాల ప్రతినిధులను మాత్రం ఆహ్వానించలేదు.


More Telugu News