Rani Mukherjee: మర్దానీ 3తో వస్తున్న రాణి ముఖర్జీ... 30 ఏళ్ల ప్రయాణంపై భావోద్వేగం!

Rani Mukherjee Emotional About 30 Year Journey
  • అభినయం, అందంతో అభిమానులను ఉర్రూతలూగించిన రాణి ముఖర్జీ
  • సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న రాణి
  • తన సినీ ప్రయాణం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య

బాలీవుడ్‌లో తన అందం, అభినయంతో అందాల భామ రాణి ముఖర్జీ ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోలందరితో నటించిన ఆమె... ఎన్నో హిట్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిన రాణి... కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆమె మళ్లీ యాక్టింగ్ లో జోరు పెంచుతోంది. 


‘మర్దానీ 3’తో ప్రేక్షకులను రాణి ముఖర్జీ పలకరించబోతోంది. రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా ఆమె నటనకు మొదటి రెండు భాగాల్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘మర్దానీ’ మొదటి భాగంలో అమ్మాయిల అక్రమ రవాణా చేసే ముఠాను ఎదుర్కొంటే, రెండో భాగంలో ఆడపిల్లలపై ఘోర నేరాలకు పాల్పడే సైకో కిల్లర్‌ను పట్టుకునే కథతో ఉత్కంఠ పెంచారు. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్‌గా నిలిచాయి.


ఇప్పుడు అదే జోష్‌తో ‘మర్దానీ 3’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ప్రమాదకర ముఠాను అంతమొందించేందుకు శివానీ శివాజీ రాయ్ రంగంలోకి దిగబోతోంది. సామాజిక సమస్యలను గట్టిగా చూపించే కథతో మూడో భాగం మరింత ఇంటెన్స్‌గా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. జనవరి 30న ‘మర్దానీ 3’ థియేటర్లలోకి రానుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఇంకో విశేషం ఏమిటంటే.. రాణి ముఖర్జీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతోంది. ఆ ప్రత్యేక సందర్భంగా ఆమె అభిమానులకు ఈ సినిమాను జనవరి 30న కానుకగా ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇటీవల ఈ సందర్భంగా రాణి ముఖర్జీ ఒక భావోద్వేగ నోట్ కూడా పంచుకుంది. తన సినీ ప్రయాణం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని, మొదటి సినిమా ‘రాజా కీ ఆయీ హై బారాత్’ చేసినప్పుడు తన కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో ఊహించలేదని ఆమె పేర్కొంది.


‘సాథియా’ సినిమా తన జీవితాన్ని మార్చిందని, అలాగే ‘బ్లాక్’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘హమ్ తుమ్’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ వంటి చిత్రాలు తన నట జీవితానికి కొత్త దిశ చూపించాయని రాణి గుర్తు చేసుకుంది. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

Rani Mukherjee
Mardaani 3
Bollywood
actress
Hindi cinema
child trafficking
Shivani Shivaji Roy
Yash Raj Films
Aditya Chopra
Raja Ki Aayegi Baraat

More Telugu News