Revanth Reddy: సీఎం, మంత్రి, ఐఏఎస్ అధికారిణిపై పోస్టులు... సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

Revanth Reddy Targeted SIT Probe Ordered on Defamatory Posts
  • సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి, ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకున్న పోస్టులపై దర్యాప్తు
  • అవమానకరమైన కంటెంట్‌పై నమోదైన రెండు కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం
  • హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు
  • సీఎం మార్ఫ్డ్ ఫొటో, ఐఏఎస్ అధికారిణిపై ఫేక్ న్యూస్ కేసులపై దర్యాప్తునకు ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేసిన రెండు కేసుల దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుల లోతైన విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈ సిట్‌కు నేతృత్వం వహించనున్నారు.

వివరాల్లోకి వెళితే, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి 'తెలంగాణ పబ్లిక్ టీవీ' అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినందుకు కావలి వెంకటేశ్‌పై నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

మరోవైపు, ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఎన్టీవీ, టీ న్యూస్‌ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ ఫిర్యాదు చేశారు. ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి, రాజకీయ నేతకు సంబంధం అంటగడుతూ, ఆమెకు 'కంఫర్ట్ పోస్టింగ్‌లు' ఇచ్చారని నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సివిల్ సర్వీసెస్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని కోల్పోయిన తర్వాత జీవితంపై ఆసక్తి లేదని, ఇలాంటి వ్యక్తిత్వ హననం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ రెండు కీలక కేసుల దర్యాప్తును సిట్ వేగవంతం చేయనుంది.


Revanth Reddy
Telangana CM
VC Sajjanar
IAS officer
Komati Reddy
Fake news
Social media
Defamation
Telangana Public TV
Special Investigation Team

More Telugu News