Upendra Dwivedi: షక్సాగామ్ లోయ తమదేనన్న చైనా... ఆ ఒప్పందం చెల్లదన్న భారత్

Upendra Dwivedi India Rejects Chinas Claim on Shaksgam Valley
  • షక్సాగామ్ లోయలోని ప్రాంతం తమకే చెందుతుందన్న చైనా
  • 1963లో పాకిస్థాన్, చైనా మధ్య జరిగిన ఒప్పందం చట్ట విరుద్ధమన్న భారత ఆర్మీ చీఫ్
  • షక్సాగామ్‌లో జరిగే కార్యకలాపాలను తాము గుర్తించబోమని వ్యాఖ్య
కశ్మీర్ సమీపంలోని షక్సాగామ్ వ్యాలీ తమ దేశంలో భాగమని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి ఖండించింది. షక్సాగామ్ లోయను పాకిస్థాన్, చైనాకు అప్పగించటానికి సంబంధించి 1963లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు.

షక్సాగామ్ లోయ తమకే చెందుతుందని ఇటీవల చైనా పేర్కొంది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చేపట్టడంలో తాము పూర్తిగా సరైన మార్గంలోనే ఉన్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ విధంగా స్పందించారు.

షక్సాగామ్ లోయను చైనాకు అప్పగిస్తూ బీజింగ్‌తో పాకిస్థాన్ చేసుకున్న ఒప్పందం చెల్లదని ఆయన తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను కూడా తాము గుర్తించబోమని అన్నారు. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌ను ఆ రెండు దేశాలు సంయుక్తంగా చేస్తోన్న చట్టవిరుద్ధమైన చర్యగా తాము పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

షక్సాగామ్ లోయ కీలకమైన కారకోరమ్ రహదారిలో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్ దీనిని ఆక్రమించి, ఆపై చైనాకు ధారాదత్తం చేసింది. భారత్‌కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని మరో దేశానికి ఇవ్వడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విరుద్ధం. అక్రమించుకున్న ఈ లోయ ద్వారానే చైనా-పాకిస్థాన్ మధ్య రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని మీదుగానే చైనా, పాకిస్థాన్ ఆర్థిక కారిడార్‌ను నిర్మిస్తున్నారు.

షక్సాగామ్ లోయ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై ఈ నెల 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్-చైనా పేర్కొంటున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని తాము ఎప్పటికీ గుర్తించబోమని భారత్ స్పష్టం చేసింది. షక్సాగామ్ లోయ తమ దేశంలో భాగమేనని భారత్ పునరుద్ఘాటించింది. దీనిపై చైనా స్పందిస్తూ, ఆ ప్రాంతం తమ దేశంలో భాగమేనని, అక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్ అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదని వాదించింది.
Upendra Dwivedi
Shaksgam Valley
China
Pakistan
India
Kashmir
China Pakistan Economic Corridor

More Telugu News