Prabhas: ప్రభాస్ సినిమాపై రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది: దాసోజు శ్రవణ్
- 'ది రాజాసాబ్' టికెట్ రేట్లు పెంచుకోకుండా చేశారన్న శ్రవణ్
- టికెట్ రేట్లపై హైకోర్టు స్టే వచ్చేటట్టు చేశారని ఆరోపణ
- సీఎం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపాటు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజాసాబ్'ను ఉద్దేశిస్తూ రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రభాస్ పెద్దమ్మ కలిసినప్పుడు... కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని కేటీఆర్ తో చెప్పారని... దీంతో కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం 'ది రాజాసాబ్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి లేకుండా చేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా కక్షపూరిత చర్యల్లో భాగమేనని... జీవో ఇచ్చినట్టే ఇచ్చి, హైకోర్టు స్టే వచ్చేట్టు మేనేజ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒక్కో హీరోకు ఒక్కో న్యాయమా? ఒక సినిమాను తిరస్కరించి, మరో సినిమాకు అనుమతి ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే సీఎం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు" అంటూ హరీశ్ రావు మాట్లాడిన మాటలు నిజమే కదా? అని శ్రవణ్ ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు మాటల దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. సీఎం తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని... ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.