Karnataka: రోడ్డు ప్రమాదమే ఆ పిల్లలను కాపాడింది.. కర్ణాటకలో కిడ్నాప్ కథ సుఖాంతం

Karnataka Kidnapping Story Ends Happily After Road Accident
  • జాతరకు తీసుకెళతానని చెప్పి పిల్లలను ఎత్తుకెళ్లిన వ్యక్తి
  • బైక్ పై పిల్లలతో కలిసి వెళుతుండగా యాక్సిడెంట్
  • అప్పటికే గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు చిక్కిన కిడ్నాపర్
కర్ణాటకలోని ధార్వాడ్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. క్లాసులు మొదలైనా పిల్లలు రాకపోవడంతో టీచర్లు ఆరా తీయగా కిడ్నాప్ విషయం బయటపడింది. వెంటనే పిల్లల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బైక్ పై వెళుతున్న కిడ్నాపర్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..

ధార్వాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన విరామం తర్వాత తన్వీర్, లక్ష్మి అనే మూడో తరగతి చిన్నారులు కనిపించకుండా పోయారు. దీంతో టీచర్లు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు స్కూలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో పిల్లలను ఓ వ్యక్తి బైక్ పై ఎక్కించుకుని వెళ్లడం కనిపించింది.

అప్రమత్తమైన పోలీసులు.. కిడ్నాపర్ వెళ్లిన మార్గంలో ఓ సెర్చి పార్టీని పంపించారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి సమీపంలో బైక్ యాక్సిడెంట్ కావడంతో కిడ్నాపర్ పోలీసులకు చిక్కాడు. పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు.. గాయాలపాలైన కిడ్నాపర్ కరీం మేస్త్రీని విచారించారు. ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకెళతానని చెప్పి పిల్లలను  తీసుకెళ్లినట్టు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
Karnataka
kidnapping
Dharwad
road accident
school children
police investigation
Dandeli
Uttara Kannada
crime news

More Telugu News