Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం.. చంద్రబాబుకు భారీ ఊరట!

Skill Development Case Against Chandrababu Closed by Court
  • స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కేసు
  • ఈ కేసులో 53 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు
  • కేసును కొట్టేసిన విజయవాడ ఏసీబీ కోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 36 మందిపై నమోదైన క్రిమినల్ కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, ఇది 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) అని నిర్ధారిస్తూ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) దాఖలు చేసిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. ఈ నిర్ణయంతో నిందితులపై ఉన్న అభియోగాలన్నీ రద్దయ్యాయి.

గత ప్రభుత్వ హయాంలో ఇదే కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 


చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.3,300 కోట్ల ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని గత ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

తాజాగా కేసును మూసివేయడానికి ముందు తమ వాదనలు వినాలంటూ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కె. అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ నివేదిక సంతృప్తికరంగా ఉందని భావించిన న్యాయస్థానం, కేసును పూర్తిగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో చంద్రబాబు సహా మొత్తం 37 మంది నిందితులు పూర్తిగా అభియోగాల నుంచి విముక్తి పొందారు.


Chandrababu Naidu
Skill Development Case
AP Skill Development Corporation
CID Investigation
ACB Court Vijayawada
Ajay Reddy
Corruption Allegations
Andhra Pradesh Politics

More Telugu News