Erfan Soltani: ఇరాన్‌లో నిరసనకారుడికి ఉరిశిక్ష: 26 ఏళ్ల యువకుడికి మరణశిక్ష ఖరారు

Erfan Soltani to Face Execution in Iran for Protests
  • ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న యువకుడు
  • 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీని ఉరితీయనున్నట్లు మానవ హక్కుల సంఘాల వెల్లడి
  • కనీస న్యాయసహాయం లేకుండానే మరణశిక్ష విధించారని ఆరోపణలు
  • ఆర్థిక సంక్షోభంతో మొదలై ప్రభుత్వ మార్పు డిమాండ్‌తో కొనసాగుతున్న ఆందోళనలు
ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్నందుకు అరెస్ట్ అయిన 26 ఏళ్ల ఎర్ఫాన్ సుల్తానీ అనే యువకుడికి ఉరిశిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మరణశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి కానుండటంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

టెహ్రాన్ సమీపంలోని కరాజ్ సబర్బ్‌లో నివసించే సుల్తానీని ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకు జనవరి 8న అరెస్ట్ చేశారు. కేవలం కొన్ని రోజుల్లోనే విచారణ ముగించి అతనికి మరణశిక్ష విధించారు. బుధవారం ఈ శిక్షను అమలు చేయనున్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శిక్ష ఖరారైన తర్వాత కేవలం 10 నిమిషాలు మాత్రమే అతన్ని కలిసేందుకు కుటుంబాన్ని అనుమతించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో సుల్తానీకి కనీస న్యాయ హక్కులు కల్పించలేదని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అతడికి లాయర్‌ను పెట్టుకునే అవకాశం ఇవ్వలేదని, చివరికి లాయర్ అయిన అతడి సోదరి కేసు ఫైల్ చూడటానికి ప్రయత్నించినా అధికారులు నిరాకరించారని పేర్కొన్నాయి. నిరసనకారులను భయపెట్టి ఆందోళనలను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి వేగవంతమైన శిక్షలను అమలు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

గత ఏడాది డిసెంబర్ చివరిలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇరాన్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అనతికాలంలోనే ఇవి దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రస్తుత పాలనను గద్దె దించాలనే డిమాండ్‌తో అతిపెద్ద ఉద్యమంగా మారాయి.
Erfan Soltani
Iran protests
Iran
Death sentence
Human rights
Government opposition
Karaj
Tehran
Economic crisis

More Telugu News