Amaravati High Court: అమరావతి హైకోర్టు నిర్మాణంలో రికార్డు.. 48 గంటల్లోనే భారీ కాంక్రీట్ పనుల పూర్తి!

Amaravati High Court Construction Achieves Record Concrete Pour in 48 Hours
  • 3,026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసిన సీఆర్డీఏ
  • వందలాది మంది కార్మికులతో షిఫ్టుల వారీగా నిరంతర శ్రమ
  • 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం
  • బేస్‌మెంట్, 7 అంతస్తులతో 52 కోర్టు హాళ్ల నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్ణీత లక్ష్యాలను అధిగమిస్తూ సీఆర్డీఏ యంత్రాంగం రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి కేవలం 48 గంటల వ్యవధిలోనే 3,026 క్యూబిక్ మీటర్ల భారీ కాంక్రీట్ నింపే ప్రక్రియను విజయవంతంగా ముగించింది.

ఈ నెల 10వ తేదీ రాత్రి ప్రారంభమైన ఈ భారీ కాంక్రీట్ పనులు, సోమవారం రాత్రికి పూర్తయ్యాయి. వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా, ఎక్కడా విరామం లేకుండా పని చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, అధికారులకు, కార్మికులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు.

గతంలో నిలిచిపోయిన ఈ పనులను ఐఐటీ నిపుణుల ధ్రువీకరణ పొందిన తర్వాతే సీఆర్డీఏ గతేడాది తిరిగి ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనులు ఆగిపోవడంతో పునాదుల్లో చేరిన నీటిని పూర్తిగా తొలగించి, పటిష్ఠమైన చర్యలు తీసుకున్న తర్వాతే పనులను వేగవంతం చేశారు.

నేలపాడు సమీపంలో ఈ శాశ్వత హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్‌మెంట్‌తో పాటు గ్రౌండ్ ప్లస్ 7 అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ భవనంలో మొత్తం 52 కోర్టు హాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2027 మార్చి నాటికి భవనాన్ని సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Amaravati High Court
Andhra Pradesh High Court
AP High Court
Amaravati
CRDA
High Court construction
K Kannababu
Andhra Pradesh
Building construction

More Telugu News