మధుమేహంతో భారత్‌కు ‘ఆర్ధిక’ ముప్పు!

  • డయాబెటిస్ వల్ల దేశంపై 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం
  • అమెరికా తర్వాత అత్యధిక నష్టం ఎదుర్కొంటున్న దేశం మనదే
  • ప్రపంచంలోని వ్యాధిగ్రస్తుల్లో నాలుగో వంతు మంది భారత్‌లోనే
  • అల్జీమర్స్, క్యాన్సర్ కంటే మధుమేహంతోనే దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ గండి
ఈ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సంక్షోభంగా పరిణమించిన మధుమేహం (డయాబెటిస్) భారత్ పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. డయాబెటిస్ కారణంగా అత్యధిక ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏకంగా 11.4 ట్రిలియన్ డాలర్ల భారం పడుతోందని 'ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్', వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేశారు.

మధుమేహం వల్ల పడే ఆర్థిక ప్రభావాన్ని 2020 నుంచి 2050 వరకు విశ్లేషిస్తూ 204 దేశాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో 16.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 11.4 ట్రిలియన్ డాలర్లతో భారత్ రెండో స్థానంలో, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం బాధితుల్లో నాలుగో వంతు మంది భారత్‌లోనే ఉండటం ఈ తీవ్రతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

మధుమేహం వల్ల దేశాల జీడీపీలో 1.7 శాతం మేర అనధికార సంరక్షణ వ్యయం రూపంలో వృథా అవుతోందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా క్యాన్సర్, అల్జీమర్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల కంటే మధుమేహం వల్లే ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వారు హెచ్చరిస్తున్నారు. మధుమేహం కారణంగా పని ఉత్పాదకత తగ్గడం, వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడం ప్రజల ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలని వారు స్పష్టం చేశారు.


More Telugu News