Pakistan economic crisis: మేం ఉండలేం... 'మిల్‌బస్' దెబ్బకు పాకిస్థాన్ నుంచి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు

Multinational Companies Leaving Pakistan Due to Economic Crisis
  • పాకిస్థాన్‌ను వీడుతున్న అంతర్జాతీయ సంస్థలు
  • వాణిజ్యంపై సైన్యం పెత్తనమే ప్రధాన కారణమని విశ్లేషణ
  • గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన విదేశీ పెట్టుబడులు
  • ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, షెల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల నిష్క్రమణ
  • రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం కూడా ఓ కారణం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలో నెలకొన్న ప్రతికూల వ్యాపార వాతావరణం, ముఖ్యంగా వాణిజ్య కార్యకలాపాల్లో సైన్యం పెత్తనం కారణంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక బహుళజాతి సంస్థలు (MNCs) పాకిస్థాన్‌ను వదిలి వెళ్లిపోతున్నాయి. ఈ పరిణామం దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) దెబ్బతీయడమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ‘ఏషియన్ న్యూస్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి వైదొలగిన కంపెనీల జాబితా చాలా పెద్దది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) దిగ్గజం ప్రాక్టర్ & గ్యాంబుల్ (P&G), ఇంధన రంగంలో ప్రసిద్ధి చెందిన షెల్, టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను విక్రయించి వెళ్లిపోయాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఫార్మా కంపెనీలు ఫైజర్, బేయర్, ఎలీ లిల్లీ, ఆటోమొబైల్ సంస్థ యమహా, రైడ్ షేరింగ్ యాప్‌లు ఉబెర్, కరీమ్, జర్మన్ ఇంజనీరింగ్ సంస్థ సీమెన్స్ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించలేమని చేతులెత్తేశాయి. 

గత మూడేళ్లలో ఫార్మా, టెక్ రంగాలకు చెందిన 21కి పైగా కంపెనీలు పాక్‌ను వీడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దిగుమతులపై ఆంక్షల కారణంగా యమహా తన ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ కంపెనీల వలసలకు అనేక ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. పాకిస్థానీ కరెన్సీ విలువ పడిపోవడం, అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలు, బలహీనమైన వినియోగదారుల డిమాండ్ వంటివి కంపెనీల లాభాలను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు రాజకీయ అస్థిరత, పెరుగుతున్న ఉగ్రవాదం, శాంతిభద్రతల సమస్యలు వ్యాపారాలకు పెనుభారంగా మారాయి. అధికార జాప్యం, అవినీతి, తరచూ మారే పన్ను విధానాలు దీర్ఘకాలిక ప్రణాళికలను అసాధ్యంగా మారుస్తున్నాయి. ఫలితంగా, 2023 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయి, పదేళ్ల కనిష్ఠ స్థాయికి చేరాయి.

‘మిల్‌బస్’.. సైన్యం నడిపే సమాంతర ఆర్థిక వ్యవస్థ

ఏషియన్ న్యూస్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సమస్యలన్నింటికీ మూల కారణం పాకిస్థాన్‌లో సైన్యం నడిపే సమాంతర ఆర్థిక వ్యవస్థ. దీనిని ‘మిల్‌బస్’ (Milbus) అని పిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్, సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్ వంటి కీలక రంగాల్లో సైన్యం వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

‘ఫౌజీ ఫౌండేషన్’ వంటి సైనిక సంస్థలకు పన్ను మినహాయింపులు, నియంత్రణల నుంచి రక్షణ, ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రాధాన్యత లభిస్తున్నాయి. ఇది సాధారణ పౌర, విదేశీ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. సమాన అవకాశాలు లేని ఈ రంగంలోకి ప్రవేశించడానికి విదేశీ పెట్టుబడిదారులు భయపడుతున్నారు. 

సైన్యం నేతృత్వంలోని ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్’ (SIFC) కూడా సైనిక అనుబంధ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో పారదర్శకత పూర్తిగా లోపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ‘మిలిటరైజ్డ్ కామర్స్’ కారణంగా పాకిస్థాన్ పెట్టుబడులకు స్వర్గధామంగా కాకుండా, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారిపోయింది. దీంతో పెట్టుబడిదారులు యూఏఈ, సింగపూర్ వంటి స్థిరమైన దేశాల వైపు చూస్తున్నారు.
Pakistan economic crisis
Multinational companies leaving Pakistan
Milbus
FDI Pakistan
Fauji Foundation
Strategic Investment Facilitation Council
pakistan economy
pakistan news

More Telugu News