కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు

  • ‘వ్యక్తిత్వ హక్కుల’ పరిరక్షణ అంశంలో కమల్ హాసన్‌కు కోర్టులో ఊరట
  • పేరు, ఫొటో, బిరుదులను వాణిజ్యపరంగా వాడకుండా మధ్యంతర ఉత్తర్వులు
  • చెన్నై సంస్థతో పాటు ఇతరులపైనా మద్రాస్ హైకోర్టు ఆంక్షలు
  • ఇది ప్రాథమికంగా హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన న్యాయస్థానం
  • సృజనాత్మక కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలకు ఈ ఆదేశాలు వర్తించవని వెల్లడి
ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టులో సోమవారం కీలక ఊరట లభించింది. తన అనుమతి లేకుండా పేరు, చిత్రం, ఇమేజ్ లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపులను వాణిజ్యపరంగా వాడుకోకుండా నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన ‘పర్సనాలిటీ రైట్స్’ను కాపాడాలంటూ కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

తన పేరు, ఫొటోలతో టీ-షర్టుల వంటి వస్తువులను విక్రయిస్తున్నారని, దీనిని ఆపాలని కోరుతూ కమల్ హాసన్ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... చెన్నైకి చెందిన 'నీయే విడై' అనే సంస్థతో పాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలు... కమల్ హాసన్ అనుమతి లేకుండా ఆయన ఫొటో, పేరు లేదా ‘ఉలగనాయగన్’ వంటి బిరుదులను ఉపయోగించరాదని ఆదేశించింది.

కమల్ హాసన్ తరఫున సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్ వాదనలు వినిపించారు. కమల్ ఇమేజ్‌ను వాణిజ్యపరంగా వాడుకోవడం ఆయన వ్యక్తిగత, ప్రచార హక్కులను స్పష్టంగా ఉల్లంఘించడమేనని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ప్రాథమికంగా కేసులో పస ఉందని (prima facie) అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ ఉత్తర్వులు వ్యంగ్య చిత్రాలు (క్యారికేచర్), సృజనాత్మక విమర్శలు, ఇతర కళాత్మక పనులకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అవి కూడా కమల్ హాసన్ ఇమేజ్‌ను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేసేలా ఉండకూడదని పేర్కొంది. తన 65 ఏళ్ల సినీ ప్రస్థానంలో తన ఇమేజ్‌కు వాణిజ్యపరంగా ఎంతో విలువ ఉందని, అనుమతి లేకుండా ఉత్పత్తులు అమ్మడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని కమల్ తన పిటిషన్‌లో తెలిపారు.

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఒక ఇంగ్లీష్, ఒక తమిళ దినపత్రికలో పబ్లిక్ నోటీసు జారీ చేయాలని కమల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.


More Telugu News