Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్... గ్రోక్ ను బ్లాక్ చేసిన రెండు దేశాలు

Elon Musk Grok AI banned in Indonesia Malaysia over deepfake concerns
  • గ్రోక్ సాయంతో డీప్ ఫేక్ చిత్రాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు
  • గ్రోక్ పై ఇండొనేషియా, మలేషియా తాత్కాలిక నిషేధం
  • మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన కంటెంట్ తయారవుతోందని ఆందోళన

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ప్రసిద్ధ AI చాట్‌బాట్ గ్రోక్ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల గ్రోక్ AIని ఉపయోగించి నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ చిత్రాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిని తాత్కాలికంగా నిషేధించాయి. మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ తయారవుతోందని, ఇది డిజిటల్ ప్రపంచంలో కొత్త ముప్పుగా మారుతోందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్ కూడా ఇటీవల ఇలాంటి అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.


గ్రోక్ AIని కొందరు దుర్వినియోగం చేసి, అనుమతి లేకుండా నకిలీ డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలు తయారు చేస్తున్నారని మలేషియా కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్ (MCMC) స్పష్టం చేసింది. ఇది వ్యక్తుల గౌరవం, భద్రతకు ముప్పు కలిగిస్తోందని, సమాజానికి తీవ్ర ప్రమాదమని వారు చెప్పారు. జనవరి 3, 8 తేదీల్లో ఎక్స్, xAIకి నోటీసులు పంపినా, కంపెనీలు యూజర్ల రిపోర్టింగ్ సిస్టమ్‌పై మాత్రమే దృష్టి పెట్టాయి కానీ, సమస్యకు నిజమైన పరిష్కారాలు అందించలేదని మలేషియా ప్రభుత్వం విమర్శించింది. దీంతో గ్రోక్‌ను తమ దేశంలో తాత్కాలికంగా బ్లాక్ చేశామని తెలిపింది.


ఇక ఇండోనేషియా విషయానికి వస్తే, గ్రోక్ ద్వారా సృష్టిస్తున్న నకిలీ అశ్లీల కంటెంట్ మహిళలు, పిల్లలకు తీవ్ర ముప్పు అని కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ మంత్రి ముత్యా హఫీద్ అన్నారు. ఇది మానవ హక్కులు, డిజిటల్ భద్రతకు తీవ్ర ఉల్లంఘన అని ఆమె వివరించారు. తమ పౌరుల గౌరవం, భద్రతకు హాని జరగకుండా చూడాలని, గ్రోక్‌ను తాత్కాలికంగా నిషేధిస్తున్నామని, X నుంచి వెంటనే వివరణ కోరామని ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది.


గ్రోక్ వంటి AI టూల్స్ ద్వారా తయారయ్యే డీప్‌ఫేక్‌లు చాలా వరకు నిజమైన వీడియోల్లాగా, ఒరిజినల్ ఫొటోల్లాగా కనిపిస్తాయి. వీటితో ప్రజల ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే భారత్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేశాయి. AI కంపెనీలు కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు xAI గ్రోక్‌ను బ్లాక్ చేశాయి. 

Elon Musk
Grok AI
xAI
deepfakes
Indonesia
Malaysia
AI chatbot
digital safety
online safety
artificial intelligence

More Telugu News