Narendra Modi: కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ... మారనున్న పీఎంవో చిరునామా

Narendra Modi to Move to New PMO Office Address Soon
  • రాయ్‌సీనా హిల్స్ వద్ద సిద్ధమైన ప్రధాని కొత్త కార్యాలయం
  • 'సేవా తీర్థ్'గా నామకరణం చేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ నెల 14 తర్వాత పీఎంవో తరలింపు ఉంటుందని అంచనా
  • స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి సౌత్ బ్లాక్ నుంచి మారనున్న పీఎంవో
  • మ్యూజియంగా మారనున్న ప్రస్తుత నార్త్, సౌత్ బ్లాక్‌లు
భారత ప్రధాని కార్యాలయం (పీఎంవో) చిరునామా త్వరలో మారనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలోనే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 14 తర్వాత, మకర సంక్రాంతి అనంతరం ఆయన కొత్త కార్యాలయంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌ నుంచే పీఎంవో కార్యకలాపాలు సాగుతుండగా, 78 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ కార్యాలయం వేరే చోటుకు మారుతుండటం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది.

రాయ్‌సీనా హిల్స్‌కు సమీపంలో, దారా షికో రోడ్డులో నిర్మించిన ఈ కొత్త భవన సముదాయానికి 'సేవా తీర్థ్' అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందులో మొత్తం మూడు భవనాలు ఉన్నాయి. 'సేవా తీర్థ్-1'ను పీఎంవో కోసం, 'సేవా తీర్థ్-2'ను కేబినెట్ సెక్రటేరియట్ కోసం, 'సేవా తీర్థ్-3'ను జాతీయ భద్రతా మండలి (NSCS) కోసం కేటాయించారు. ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్ గత ఏడాది సెప్టెంబర్‌లోనే కొత్త భవనంలోకి మారింది. ఇప్పుడు పీఎంవో కూడా తరలివెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) పర్యవేక్షణలో లార్సెన్ అండ్ టూబ్రో (L&T) సంస్థ రూ.1,189 కోట్ల వ్యయంతో 24 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేసింది. పాలనలో అధికారం ('సత్తా') కాకుండా సేవకే ('సేవ') ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేందుకే ఈ భవనానికి 'సేవా తీర్థ్' అని పేరు పెట్టినట్లు గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

ప్రధాని కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి వంటి కీలక కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండటం వల్ల సమన్వయం మెరుగవుతుందని, భద్రత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పీఎంవో పూర్తిగా ఖాళీ అయిన తర్వాత చారిత్రక నార్త్, సౌత్ బ్లాక్‌లను 'యుగ యుగీన్ భారత్ సంగ్రహాలయ' పేరుతో జాతీయ మ్యూజియంగా మార్చనున్నారు.
Narendra Modi
PMO
Prime Minister Office
Seva Tirth
Central Vista Project
New Office
Delhi
Government
Amit Shah
India

More Telugu News