: ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

  • ఎన్జీవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
  • పూడ్చిపెట్టిన కళేబరాలను వెలికి తీసి పోస్ట్ మార్టం
  • రెండు గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్థులపై కేసు
వీధి కుక్కల బెడద తప్పిస్తానని సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకున్నారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో పంచాయతీ సిబ్బందితో గ్రామంలోని వీధికుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపించారు. సుమారు 300 కుక్కలను చంపించి ఊరవతల ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టారు. హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో చోటుచేసుకుందీ దారుణం.
 
ఈ విషయం తెలిసి ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అనే ఎన్జీవో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక గ్రామ సర్పంచులు, కార్యదర్శులపై ఆ సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ కూడా జోక్యం చేసుకున్నారు. వీధికుక్కలను అత్యంత అమానవీయంగా చంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ దారుణానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఎన్జీవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రెండు గ్రామాల శివార్లలో పాతిపెట్టిన వీధికుక్కల కళేబరాలను వెలికి తీసి పశువైద్యుశాలలో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి శాయంపేట, ఆరేపల్లి గ్రామాల సర్పంచ్ లు, కార్యదర్శులతో పాటు మొత్తం 9 మంది పై జంతు సంరక్షణ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు.

కుక్క కాటు బాధితులు పెరుగుతున్నారనే..
వీధి కుక్కలు రెచ్చిపోయి దాడులు చేస్తున్నాయని, కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగిపోతుందనే కుక్కలను చంపించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. తమ గ్రామంలోని వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల తాము వ్యాధుల బారిన పడుతున్నామని వివరించారు.

More Telugu News