Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్

Websol Renewable to Invest Rs3538 Crore in AP Solar Plant
  • నాయుడుపేటలో భారీ సోలార్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు వెబ్‌సోల్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం
  • మొత్తం ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ సోలార్ యూనిట్
  • ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు
  • దేశంలోనే కీలకమైన సోలార్ తయారీ కేంద్రంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్
  • ఏపీ పారిశ్రామిక విధానం పెట్టుబడులకు అత్యంత అనుకూలమని పరిశ్రమ వర్గాల ప్రశంస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సౌరశక్తి తయారీ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. తిరుపతి జిల్లా, నాయుడుపేటలోని ఎంపీసెజ్‌లో (MPSEZ) భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వెబ్‌సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. మొత్తం ₹3,538 కోట్ల పెట్టుబడితో 8 గిగావాట్ల (4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్) పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2,000 మందికి ఉపాధి లభించనుంది.

ఈ ప్రాజెక్టును 120 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. 2027 జులై నాటికి మొదటి దశ, 2028 జులై నాటికి రెండో దశ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా, తక్కువ ఖర్చుతో సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా, కంపెనీ 100 మెగావాట్ల కెపాసిటీతో సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ పెట్టుబడితో నాయుడుపేట, సమీపంలోని దక్షిణ తమిళనాడు పారిశ్రామిక కారిడార్ దేశంలోనే కీలకమైన సోలార్ తయారీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, వోల్ట్‌సన్ వంటి దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో సరఫరాదారులు, లాజిస్టిక్స్, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పోర్టు కనెక్టివిటీతో ఒక శక్తిమంతమైన పారిశ్రామిక వాతావరణం (ecosystem) ఏర్పడుతోంది.

ఈ పెట్టుబడిపై వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోహన్ లాల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో ముందుకు సాగుతున్న తరుణంలో, మా విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన ఆమోదం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడి అనుకూల పారిశ్రామిక వాతావరణం మా 8 గిగావాట్ల వృద్ధి ప్రణాళికను అమలు చేయడానికి బలమైన వేదికను అందిస్తుంది,” అని తెలిపారు.

ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ యాప్‌లో కంప్లైంట్ ఎలా ఇవ్వాలో స్టెప్-బై-స్టెప్ మాట్లాడుతూ.. “వెబ్‌సోల్ ₹3,500 కోట్ల పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్-ఎనర్జీ తయారీకి అత్యంత పోటీతత్వ గమ్యస్థానంగా నిలబెడుతోంది. వేగవంతమైన భూ కేటాయింపులు, సింగిల్-డెస్క్ అనుమతులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలతో ప్రపంచంతో పోటీపడే సోలార్ తయారీ వాతావరణాన్ని నిర్మిస్తున్నాం. నాయుడుపేట ప్రాంతం భారత పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది” అని అన్నారు.
Websol Renewable
Andhra Pradesh
Solar Plant
Naidupeta
Renewable Energy
Nara Lokesh
MPSEZ
Solar Manufacturing
Clean Energy
Investment

More Telugu News