Jammu and Kashmir: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల హై అలర్ట్

Pakistan Drones Spotted Near Jammu Kashmir Border Security Forces on High Alert
  • సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో డ్రోన్ల కదలికల గుర్తింపు
  • రాజౌరీలోని నౌషెరా సెక్టార్‌లో డ్రోన్‌పై మెషిన్ గన్లతో కాల్పులు జరిపిన సైన్యం
  • ఆయుధాలు, మాదకద్రవ్యాల కోసం సరిహద్దు వెంబడి గాలింపు చర్యల ముమ్మరం
జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సుమారు ఐదు ప్రాంతాల్లో ఈ డ్రోన్ల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఈ డ్రోన్లు సున్నితమైన ప్రాంతాల్లో కొద్దిసేపు తచ్చాడి, తిరిగి పాక్ వైపు వెళ్లిపోయాయి.

రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద డ్రోన్ కదలికలను గమనించిన ఆర్మీ దళాలు వెంటనే అప్రమత్తమై మెషీన్ గన్లతో కాల్పులు జరిపాయి. అదే సమయంలో తర్యత్ ప్రాంతంలోని ఖబ్బర్ గ్రామం వద్ద కూడా వెలుగులు జిమ్మే డ్రోన్ వంటి వస్తువు కనిపించి మాయమైంది. సాంబా జిల్లా రామ్‌గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్‌కోట్ సెక్టార్‌లలో కూడా ఇదే తరహా డ్రోన్ల సంచారాన్ని అధికారులు ధ్రువీకరించారు.

ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను భారత భూభాగంలోకి జారవిడిచారా? అన్న అనుమానంతో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల క్రితమే సాంబా జిల్లా పాలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా పంపిన ఆయుధాలను (రెండు పిస్టల్స్, గ్రెనేడ్, బుల్లెట్లు) స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజా కదలికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో సరిహద్దుల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
Jammu and Kashmir
Pakistan drones
drones
Samba
Rajouri
Poonch
LoC
security forces
high alert
arms smuggling

More Telugu News