పశువుల అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అఖిలప్రియ మెరుపు దాడి.. ఐదు కంటెయినర్ల సీజ్

  • చాగలమర్రి టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి కంటెయినర్లను అడ్డుకున్న ఎమ్మెల్యే
  • ఒక్కో కంటెయినర్‌లో నిబంధనలకు విరుద్ధంగా 40-50 పశువుల తరలింపు
  • తెలంగాణ నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకున్న వైనం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ జాతీయ రహదారి మీదుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. పశువుల అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో శనివారం అర్ధరాత్రి దాటాక టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డితో కలిసి చాగలమర్రి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో పశువులతో వెళ్తున్న ఐదు కంటెయినర్లను గుర్తించి నిలిపివేశారు. వెంటనే ఆళ్లగడ్డ పోలీసులకు సమాచారం అందించగా.. డీఎస్పీ ప్రమోద్‌కుమార్, ఎస్సై వరప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో వాహనంలో పరిమిత సంఖ్యలో పశువులు ఉండాల్సి ఉండగా, ఒక్కో కంటెయినర్‌లో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు ఆ ఐదు వాహనాలను గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రక్షించిన పశువులను నందికొట్కూరులోని గోశాలకు పంపించారు. ఈ పశువులను తెలంగాణలోని పెబ్బేరు నుంచి కడపకు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.



More Telugu News