Pawan Kalyan: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్... తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Tiger of Martial Arts Creates History
  • పవన్ కల్యాణ్‌కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' బిరుదు
  • జపాన్ షింగెన్ క్లాన్‌లో ప్రవేశించిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత
  • యుద్ధ కళ 'కెంజుట్సు'లో 5వ డాన్ పురస్కారం
  • మూడు దశాబ్దాల సాధనకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యుద్ధ కళల్లో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక 'టకెడా షింగెన్ క్లాన్‌'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది.

ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో పవన్ నైపుణ్యానికి జపాన్‌కు చెందిన 'సోగో బుడో కన్‌రి కై' సంస్థ 5th డాన్ (ఫిఫ్త్ డాన్) పురస్కారాన్ని అందించింది. అంతేకాకుండా, జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై'కి చెందిన 'టకెడా షింగెన్ క్లాన్‌'లో ఆయనకు ప్రవేశం లభించింది. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో 'కెండో'లో కూడా ఆయన ఉన్నత స్థాయి శిక్షణ పొందారు.

చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్న పవన్, మూడు దశాబ్దాలుగా క్రమశిక్షణతో సాధన చేస్తున్నారు. చెన్నైలో కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా, జపనీస్ సమురాయ్ యుద్ధ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. తన సినిమాలలో యుద్ధ కళలను ప్రదర్శించి, వాటికి తెలుగునాట విస్తృత ప్రజాదరణ కల్పించారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఆయన నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమవుతుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ అంతర్జాతీయ పురస్కారం యుద్ధ కళల పట్ల పవన్‌కు ఉన్న అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

అసలేమిటీ కెంజెట్సు...?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జపాన్‌కు చెందిన ప్రాచీన యుద్ధకళ 'కెంజుట్సు'లో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ఈ ఘనతతో ఆయన తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు. ఈ నేపథ్యంలో, అసలు కెంజుట్సు అంటే ఏమిటి? దాని చరిత్ర, ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

కెంజుట్సు అనేది జపనీస్ భాషలో 'కత్తి విద్య' లేదా 'కత్తి నైపుణ్యం' అని అర్థం. ఇది కేవలం ఒక క్రీడ కాదు, ఒకప్పుడు సమురాయ్ యోధులు యుద్ధభూమిలో ప్రాణరక్షణ కోసం, శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించిన వాస్తవ పోరాట పద్ధతుల సమాహారం. ఈ యుద్ధకళ జపాన్ సాంప్రదాయ యుద్ధ విద్యలలో (కో-బుడో) అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది.

ఈ కళకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. జపాన్‌లో కమకురా కాలంలో (1192-1333) జరిగిన అంతర్యుద్ధాల సమయంలో కెంజుట్సు ఒక ప్రధాన యుద్ధ విద్యగా అభివృద్ధి చెందింది. మురోమాచి కాలంలో 'టెన్షిన్ షోడెన్ కటోరి షింటో-ర్యూ' వంటి మొట్టమొదటి శిక్షణా కేంద్రాలు (స్కూల్స్) ఏర్పడ్డాయి. ఎడో కాలం (1603-1868) వచ్చేసరికి 500కు పైగా స్కూల్స్ వెలిశాయి. అయితే, 1868లో మెయిజీ పునరుద్ధరణ తర్వాత సమురాయ్ వ్యవస్థ అంతరించిపోవడంతో కెంజుట్సు ప్రాబల్యం తగ్గింది. దీని నుంచే ఆధునిక క్రీడ అయిన 'కెండో' పుట్టింది.

కెంజుట్సు శిక్షణలో ప్రధానంగా 'కటానా' (పొడవాటి కత్తి) ఉపయోగిస్తారు. సాధన కోసం 'బోకెన్' (చెక్క కత్తి) వాడతారు. ఇందులో కత్తిని అడ్డంగా, నిలువుగా, వాలుగా నరకడం (కిరి), పొడవడం (ట్సుకి), దాడులను అడ్డుకోవడం (ఉకె) వంటి అనేక పద్ధతులు ఉంటాయి. శిక్షణ ప్రధానంగా 'కటా' రూపంలో ఉంటుంది. అంటే, ఇద్దరు వ్యక్తులు ముందుగా నిర్దేశించిన పద్ధతిలో దాడి, ప్రతిదాడి చేస్తూ సాధన చేస్తారు. ఇది నిజమైన పోరాటాన్ని తలపిస్తుంది.

చాలామంది కెంజుట్సును కెండో, ఇయాయిడోలతో పోల్చి గందరగోళానికి గురవుతారు. కెంజుట్సు ప్రాచీన యుద్ధ పద్ధతులపై దృష్టి సారిస్తే, కెండో అనేది సురక్షితమైన ఆధునిక క్రీడ. ఇక ఇయాయిడో అనేది ఒర నుంచి కత్తిని వేగంగా తీసి దాడి చేసే కళ. కెంజుట్సు కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాదు, మానసిక క్రమశిక్షణ, ఏకాగ్రత, గౌరవం, ధైర్యం వంటి 'బుషిడో' (సమురాయ్ నియమావళి) సూత్రాలను కూడా నేర్పుతుంది. అటువంటి అరుదైన, గౌరవనీయమైన యుద్ధకళలో పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆయన వ్యక్తిగత పట్టుదలకే కాకుండా, ఈ కళ పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం.


Pawan Kalyan
AP Deputy CM
Martial Arts
Takeda Shingen Clan
Golden Dragons
Kenjutsu
Sogo Budo Kanri Kai
Hanshi Professor Siddique Mahmoodi
Ustaad Bhagat Singh
Surender Reddy

More Telugu News