భారత్‌తో వివాదం... ఇండియా-కివీస్ తొలి వన్డేలో బంగ్లాదేశ్ అంపైర్!

  • ఇండియా, న్యూజిలాండ్ వన్డేకు థర్డ్ అంపైర్ గా షర్ఫుద్దౌలా
  • ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్ వివాదం నేపథ్యంలో ఈ పరిణామం
  • ఇరు దేశాల బోర్డుల మధ్య ఉద్రిక్తతలను మరింత హైలైట్ చేసిన అంశం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా అంపైర్ థర్డ్ అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.

వివాదం ఇదే.. 
ఐపీఎల్ 2026 వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో... బీసీసీఐ సూచన మేరకు కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. అంతేకాకుండా, భద్రతా కారణాలను చూపి, ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

తొలి వన్డేలో థర్డ్ అంపైర్‌గా.. 
ఈ ఉద్రిక్తతల నడుమ, ఆదివారం గుజరాత్‌లోని వడోదరలో జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేకు బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ సైకత్ థర్డ్ అంపైర్‌గా నియమితుడయ్యాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం, సిరీస్‌లో పాల్గొనే దేశాలకు చెందని ఒక న్యూట్రల్ అంపైర్‌ను నియమించడం తప్పనిసరి. ఇందులో భాగంగానే షర్ఫుద్దౌలా ఈ మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. అతడు మార్చి 2024లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో స్థానం సంపాదించిన తొలి బంగ్లాదేశ్ అంపైర్‌గా గుర్తింపు పొందాడు.



More Telugu News