Rajiv Gandhi International Airport: సామాన్యుడికీ విమానాశ్రయ విందు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఉడాన్ యాత్రి కెఫే' ప్రారంభం!

Rajiv Gandhi International Airport Launches Udan Yatri Cafe
  • పది రూపాయలకే టీ, రూ. 20కే కాఫీ, అతి తక్కువ ధరలకే స్నాక్స్ అందుబాటులోకి
  • విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరల నుంచి సామాన్య ప్రయాణికులకు విముక్తి
  • శంషాబాద్ విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్, చెక్-ఇన్ హాల్, గేట్ నంబర్ 1 వద్ద ఏర్పాటు
సామాన్య విమాన ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తీసుకున్న కీలక నిర్ణయం కార్యరూపం దాల్చింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో 'ఉడాన్ యాత్రి కెఫే' శనివారం నుంచి తన సేవలను ప్రారంభించింది.

విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్యుడు కనీసం టీ తాగే పరిస్థితి కూడా లేదని ప్రయాణికులు గత కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అంశం పార్లమెంటులో కూడా చర్చకు రావడంతో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్కువ ధరల కెఫేలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే గతేడాది జనవరిలో కోల్‌కతాలో తొలి కెఫే ప్రారంభం కాగా, ఇప్పుడు హైదరాబాద్‌లో రెండోది అందుబాటులోకి వచ్చింది.

ఈ కెఫేలో టీ కేవలం రూ. 10లకే లభిస్తుండగా, కాఫీ రూ. 20లకు అందిస్తున్నారు. ప్రయాణికులు విమానం ఎక్కేముందు నామమాత్రపు ధరలకే అల్పాహారం, స్నాక్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. "ప్రయాణికుల సేవల నాణ్యతను పెంచడంలో ఉడాన్ యాత్రి కెఫే ఒక ప్రధాన అడుగు" అని విమానాశ్రయ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ (X) ద్వారా వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణికుల చెక్-ఇన్ హాల్ గేట్ నంబర్ 1 వద్ద ఉన్న ఈ కెఫే పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Rajiv Gandhi International Airport
Hyderabad Airport
Shamshabad Airport
Udan Yatri Cafe
Airport Authority of India
AAI
Rammohan Naidu
Low Cost Food
Airport Food Prices
Airline Passengers

More Telugu News