ISIS: ఐసిస్ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం.. 'ఆపరేషన్ హాకీ స్ట్రైక్' ఉద్ధృతం

ISIS Bases Bombed by US in Syria Operation Hockey Strike
  • సిరియా వ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా భారీ దాడులు 
  • గతేడాది డిసెంబర్ 13న పల్మైరాలో జరిగిన దాడికి అమెరికా ప్రతీకారం
  • ఉగ్రవాద నిర్మూలనలో అమెరికాతో కలిసి పనిచేస్తున్న సిరియా
సిరియాలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై అమెరికా సైన్యం శనివారం మెరుపు దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను ధృవీకరిస్తూ 'ఆపరేషన్ హాకీ స్ట్రైక్'లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. 2025 డిసెంబర్‌లో పల్మైరా సమీపంలో జరిగిన ఐసిస్ మెరుపు దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులతో పాటు ఒక పౌర అనువాదకుడు మరణించాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించిన క్రమంలోనే శనివారం మధ్యాహ్నం అమెరికా గగనతల దళాలు సిరియాలోని పలు ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టంపై స్పష్టమైన వివరాలు అందాల్సి ఉంది.

13 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధం తర్వాత 2024 డిసెంబర్‌లో బషర్ అల్-అస్సాద్ పాలన కూలిపోయింది. ప్రస్తుతం అహ్మద్ అల్-షరా నేతృత్వంలోని ప్రభుత్వం సిరియాను పాలిస్తోంది. ఒకప్పుడు అల్-ఖైదాతో సంబంధాలున్న ఈ బృందాలు ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అమెరికాతో చేతులు కలిపాయి. గతేడాది షరా వైట్ హౌస్‌ను సందర్శించిన సందర్భంగా ఐసిస్ వ్యతిరేక కూటమిలో సిరియా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం సిరియాలో దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. 
ISIS
Islamic State
Syria
America
US Military
Operation Hockey Strike
Donald Trump
Ahmed al-Shara
Al-Qaeda
Palmyra

More Telugu News