Basim Saleh Yasin: వెస్ట్ బ్యాంక్‌లో దారుణం: వృద్ధుడిపై ఇజ్రాయెల్ సెటిలర్ల అమానుష దాడి.. వీడియో ఇదిగో!

Israeli Settlers Brutally Attack Elderly Palestinian Basim Saleh Yasin in West Bank
  • ముసుగులు ధరించి నర్సరీపై దాడికి తెగబడిన సెటిలర్లు 
  • బధిరుడైన వృద్ధుడిని కర్రలతో కొట్టి, తలపై తన్ని హింస
  • వెస్ట్ బ్యాంక్‌లో రోజురోజుకు పెరుగుతున్న ఇజ్రాయెల్ సెటిలర్ల దాడులు
పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిలర్లు మరోసారి బరితెగించారు. ముసుగులు ధరించిన గుంపు 67 ఏళ్ల బేసిమ్ సలేహ్ యాసిన్ అనే వృద్ధుడిపై అమానుషంగా దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి కలకలం రేపుతోంది. 

జర్మన్-పాలస్తీనియన్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఒక నర్సరీలోకి ఇజ్రాయెల్ సెటిలర్లు చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న మిగిలిన కార్మికులు వారిని చూసి పారిపోగా యాసిన్ చెవుడు కారణంగా హెచ్చరికలు వినలేక అక్కడే ఉండిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించిన యాసిన్‌ను చుట్టుముట్టిన దుండగులు కిందపడేసి కర్రలతో కొట్టారు. చివరకు ఒక వ్యక్తి యాసిన్ తలపై బలంగా తన్నడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ దాడిలో యాసిన్ ముఖం, ఛాతీ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, చేతి ఎముకలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు.

1967 యుద్ధం తర్వాతి నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్ట్ బ్యాంక్‌లో ప్రస్తుతం 5 లక్షలకు పైగా యూదులు స్థిరపడ్డారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సెటిల్మెంట్లు అక్రమమైనవని భావిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల మరో 19 కొత్త సెటిల్మెంట్లకు అనుమతి ఇచ్చింది. మరోవైపు, జెరూసలేం సమీపంలో వెస్ట్ బ్యాంక్‌ను రెండుగా విభజించేలా వివాదాస్పద నిర్మాణ పనులకు ఇజ్రాయెల్ తుది అనుమతులు మంజూరు చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇవి అతివాదులు చేస్తున్న పనులని కొట్టిపారేస్తున్నా, పాలస్తీనియన్లు మాత్రం తమపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Basim Saleh Yasin
West Bank
Israeli settlers
Palestine
Israeli occupation
settler violence
West Bank violence
Netanyahu
Palestinian territories
Israeli settlements

More Telugu News