Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మీడియా కథనాలు... తీవ్రంగా స్పందించిన జగ్గారెడ్డి

Jagga Reddy Responds Strongly to Media Reports on Komatireddy Venkat Reddy
  • ఎదుటి వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం మంచిది కాదన్న జగ్గారెడ్డి
  • అలాంటి రాతలను ప్రోత్సహించిన వారిది, రాసిన వారిది.. ఇద్దరిదీ తప్పేనని వ్యాఖ్య
  • వెంకట్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడన్న జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వచ్చిన నిరాధార కథనాలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ఇలాంటి సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు.

ఎవరైనా దురుద్దేశపూర్వకంగా అలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా అది సరికాదని అన్నారు. మంత్రిపై అలాంటి రాతలకు ఎవరైనా ప్రోత్సహిస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కథనం రాసిన వారితో పాటు ప్రేరేపించిన వారిది కూడా తప్పే అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగిన నాయకుడని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక చరిత్ర అని పేర్కొన్నారు.

ఒక ఆడ, మగ మాట్లాడితే పెడార్థాలు తీస్తారా అంటూ ఆయన దుమ్మెత్తి పోశారు. పనిగట్టుకుని బురద జల్లడానికి ఇదేమైనా ప్రజా సమస్యనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాయడానికి బదులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను బయటకు తీసుకు రావాలని సూచించారు. చేతిలో కలం ఉందని ఇష్టారీతిన రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పులు చేసి ప్రజలకు సేవ చేసే మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి తీవ్ర పదజాలం ఉపయోగించారు. 
Komatireddy Venkat Reddy
Jagga Reddy
Telangana Congress
Telangana Politics
Media Reports

More Telugu News