Revanth Reddy: పాఠశాల విద్యార్థులకు వైద్యులు సీపీఆర్ నేర్పిస్తే, వారు ఎన్నో ప్రాణాలు కాపాడుతారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says Doctors Teaching CPR in Schools Can Save Lives
  • హైదరాబాద్‌లో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
  • తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే సోషల్ డాక్టర్‌ని అన్న సీఎం
  • ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని వెల్లడి
పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ నేర్పిస్తే చాలామంది ప్రాణాలు కాపాడవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే సోషల్ డాక్టర్‌నని అన్నారు.

ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలసీలను మెరుగుపరచడానికి వైద్యులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకోసం వైద్యులు సూచనలు ఇవ్వాలని కోరారు. వైద్యులు ప్రజలు, సమాజంపై తమ బాధ్యతను ఎప్పుడూ మరిచిపోకూడదని అన్నారు. వైద్యులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అదే సమయంలో ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దని సూచించారు.

గుండె జబ్బులను నివారించే మిషన్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్యులు కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఆరోగ్య రంగంలో ఆవిష్కరణల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి అన్నారు.
Revanth Reddy
Telangana
CPR training
cardiology
HICC Hyderabad
health care
medical research

More Telugu News