వ్యవసాయానికి ఆటంకం లేకుండా ఉపాధి.. ‘జీ రామ్ జీ’పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

  • ఉపాధి హామీ స్థానంలో వచ్చిన 'జీ రామ్ జీ' పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఉపాధి కల్పనతో పాటు గ్రామాల్లో ఆస్తుల సృష్టి లక్ష్యంగా అమలుకు ఆదేశం
  • కూటమి భాగస్వాములైన బీజేపీ, జనసేన నేతలతో సీఎం భేటీ
  • స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పథకం అమలుకు ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ (గ్రామీణ్) - వీబీ జీ రామ్ జీ' పథకాన్ని పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించేలా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) స్థానంలో వచ్చిన ఈ నూతన పథకంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూటమి పక్షాలు ఉమ్మడిగా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

శనివారం నాడు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాష్ట్ర మంత్రి, జనసేన నేత కందుల దుర్గేష్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ‘జీ రామ్ జీ’ పథకం అమలు, దాని ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పాత పథకంతో పోలిస్తే, కొత్త మార్గదర్శకాల ప్రకారం 25 రోజులు అదనపు ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిబంధనలు రూపొందించడం శుభపరిణామం. దీనివల్ల కూలీలు, రైతులు ఇద్దరికీ మేలు జరుగుతుంది," అని వివరించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నరేగా నిధులతో సుమారు 25 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి గ్రామాల్లో ఆస్తులు సృష్టించామని, కానీ గత ప్రభుత్వం ఆస్తుల కల్పనను పూర్తిగా విస్మరించిందని చంద్రబాబు విమర్శించారు. "జీ రామ్ జీ పథకాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా గ్రామాల్లో అనేక మౌలిక వసతులు కల్పించవచ్చు. నరేగాలో లేని సోలార్ లైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు వంటి పనులను కూడా ఈ పథకం కింద చేపట్టే వెసులుబాటు ఉంది. ఇది గ్రామాల రూపురేఖలను మారుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలతో అనుసంధానం

కూటమి ప్రభుత్వం నిర్దేశించుకున్న 10 సూత్రాల ఆధారంగా రాష్ట్రాభివృద్ధికి ‘జీ రామ్ జీ’ పథకాన్ని అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. "కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈ స్కీం కింద గోకులాల నిర్మాణం, పశుగ్రాసం పెంపకం, ప్లాంటేషన్ వంటివి చేపట్టి ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో అనుసంధానించి ప్రతి ఇంటికి తాగునీరు అందించవచ్చు. పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణం, మరమ్మతుల ద్వారా ఆస్తులను అభివృద్ధి చేసుకోవచ్చు" అని చంద్రబాబు అన్నారు. 

ఏ పనులు చేపట్టాలనే దానిపై గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలని, పనుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడం ద్వారా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ కూటమి నేతలు సమావేశమై ఆయన సూచనలు తీసుకోవాలని తెలిపారు.

మౌలిక వసతుల కల్పనకు అవకాశం: మంత్రి దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో ఎన్నో ఆస్తులు సృష్టించారని గుర్తుచేశారు. "జీ రామ్ జీ పథకంతో నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధికి భరోసా లభిస్తుంది. చెక్ డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంచవచ్చు. అవినీతికి తావులేకుండా పటిష్టమైన నిబంధనలతో ఈ పథకాన్ని రూపొందించారు" అని అన్నారు.

అవినీతికి ఆస్కారం లేని విధానం: మాధవ్

బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ, ‘జీ రామ్ జీ’ పథకంలో అవినీతిని అరికట్టేందుకు పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. "జియో రిఫరెన్స్, బయోమెట్రిక్ జియో స్పేషియల్ టెక్నాలజీతో పనులను పర్యవేక్షిస్తారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఉండదు. పీఎం గతిశక్తితో అనుసంధానం చేయడం ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికీ చేరతాయి. చంద్రబాబు నాయకత్వంలో ఈ పథకం ఏపీలో సమర్థవంతంగా అమలవుతుందన్న నమ్మకం ఉంది" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 


More Telugu News