Chandrababu Naidu: జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే ఇలాంటి ప్రచారం చేయరు: సీఎం చంద్రబాబు

Chandrababu slams Jagan on river policies
  • మీడియాతో సీఎం చంద్రబాబు చిట్ చాట్
  • జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే నదులపై దుష్ప్రచారం చేయరని వ్యాఖ్యలు
  • రెండు తెలుగు రాష్ట్రాలు నీటి కోసం గొడవ పడొద్దన్న చంద్రబాబు
  • పట్టిసీమతోనే రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి చెందిందని వెల్లడి
  • గత ప్రభుత్వం రూ.900 కోట్ల బిల్లులు చేసుకుందని ఆరోపణ
  • రాజధానిపై వైసీపీ ఇంకా విషం చిమ్ముతోందని విమర్శ
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే నదుల గురించి ఇలా దుష్ప్రచారం చేయరని, అసలు సింధు నాగరికత ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలైన దేశ రాజధాని దిల్లీ, లండన్ వంటివన్నీ నదీ తీరాల వెంబడే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నదీ గర్భం (river bed), నదీ పరివాహక ప్రాంతం (river basin)కు కనీస తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బుద్ధి చెప్పినా రాజధాని విషయంలో ఇప్పటికీ విషం చిమ్మడం మానలేదని విమర్శించారు. శనివారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన చంద్రబాబు, పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు పడితే అంతిమంగా నష్టపోయేది తెలుగు ప్రజలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. "రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుంది? తెలంగాణతో కలిసి సహకరించుకుని మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి" అని సూచించారు. 

నీటిని సమర్థవంతంగా వాడుకోవడం వల్లే రాయలసీమ స్వరూపం మారిందని, పట్టిసీమ ప్రాజెక్టు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగానే రాయలసీమలో ఉద్యాన విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోనే ఉద్యాన (హార్టికల్చర్) రంగంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని గర్వంగా చెప్పారు. రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఆపేసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 2020లో కేవలం మట్టి పనులు చేసి రూ.900 కోట్ల బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో నీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత అనేదే లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 
Chandrababu Naidu
Jagan
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Project
Telugu states
water resources
river basin
horticulture
Pattiseema project
irrigation

More Telugu News