ట్రేడింగ్ చిట్కాలు అంటూ మాజీ ఐపీఎస్ భార్యకు రూ.2.58 కోట్లు టోకరా

  • ట్రేడింగ్ చిట్కాల పేరుతో వాట్సాప్ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు
  • అవగాహన లేకపోవడంతో భర్త నెంబర్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించిన భార్య
  • పెట్టుబడులు పెడితే 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు సైబర్ నేరగాళ్లు రూ.2.58 కోట్ల మేర టోకరా వేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు సమాచారం. ట్రేడింగ్ చిట్కాలు చెబుతామంటూ సైబర్ నేరగాళ్లు తొలుత ఆమెకు వాట్సాప్ సందేశం పంపించారు. ఆమెకు స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో తన భర్త నెంబరును ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేర్పించారు.

తాము సూచించిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే 500 శాతం లాభాలు వస్తాయని, ఇది సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అని చెప్పడంతో పాటు ఆమెను నమ్మించడానికి నకిలీ సెబీ సర్టిఫికెట్లు పంపించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన బాధితురాలు, మరింత డబ్బు పెట్టేందుకు ఆసక్తి కనబరచలేదు. దీంతో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. అదనంగా పెట్టుబడులు పెట్టకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు అంతా పోతుందని బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


More Telugu News