Vijay: విజయ్ సినిమా నిర్మాత ఆవేదన.. పరిస్థితి చేయి దాటిపోయిందని వ్యాఖ్య
- సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో నిలిచిపోయిన 'జన నాయగన్' విడుదల
- విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని ఆకాంక్షించానన్న నిర్మాత
- వివాదాల మధ్య సినిమా గందరగోళ పరిస్థితిలో పడిందని వ్యాఖ్య
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తన చివరి చిత్రం 'జన నాయగన్' (తెలుగులో 'జన నాయకుడు')కు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని అనుకున్న నిర్మాత వెంకట్ కె. నారాయణ... మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని తాను ఆకాంక్షించానని, కానీ ప్రస్తుత పరిస్థితి తమ చేయి దాటిపోయిందని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూనే... అభిమానులు, పంపిణీదారులకు క్షమాపణలు కూడా చెప్పారు. చట్టపరమైన సమస్యలు, వివాదాల మధ్య ఈ సినిమా గందరగోళ పరిస్థితిలో పడిందని... తమిళనాడులో ఎన్నికల వాతావరణం కూడా ఈ ప్రక్రియను మరింత కష్టతరం చేసిందని ఆయన వివరించారు.
సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో అసలు ఏం జరిగిందంటే... షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను 2025 డిసెంబర్ 18న సెన్సార్ బోర్డుకు సబ్మిట్ చేశారు. డిసెంబర్ 22న యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు నుంచి ఈమెయిల్ వచ్చింది. అందులో కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసి మళ్లీ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించారు. రిలీజ్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే, జనవరి 5న సినిమాపై ఫిర్యాదులు వచ్చాయని చెప్పి, దాన్ని రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు సెన్సార్ బోర్డు మరో మెయిల్ చేసింది. రివైజింగ్ కమిటీని సంప్రదించడానికి సమయం మించిపోవడం, అసలు ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించామని నిర్మాత వివరించారు.
మద్రాస్ హైకోర్టులో ఈ కేసు విచారణ ఇంకా నాటకీయంగా సాగింది. జనవరి 9న సింగిల్ బెంచ్ సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో విజయ్ అభిమానులు, చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నారు, సంబరాలు కూడా మొదలయ్యాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అదే రోజు సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) ఆ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. కోర్టు మాట్లాడుతూ, సినిమా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడి తీసుకువచ్చారని, ఇందులో ఎలాంటి తొందర అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.