Huijia Ji: అక్రమంగా సరిహద్దు దాటేందుకు యత్నించిన చైనా మహిళ అరెస్ట్

China Woman Huijia Ji Arrested for Illegal Border Crossing
  • ఇండో-నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించిన చైనా మహిళ
  • అదుపులోకి తీసుకున్న సశస్త్ర సీమా బల్ సిబ్బంది
  • వీసా, పాస్‌పోర్టు లేకుండానే సరిహద్దు దాటేందుకు యత్నం

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బంది పట్టుకున్నారు. సరైన వీసా, పాస్‌పోర్టు వంటి ప్రయాణ పత్రాలు లేకుండానే ఇండో–నేపాల్ సరిహద్దు దాటేందుకు ఆమె ప్రయత్నించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.


శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో భారత్–నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నౌటన్వా ప్రాంతంలోని బైరియా బజార్ వద్ద కాలిబాట మార్గంలో ఒక మహిళ భారత్‌లోకి వస్తున్నట్లు ఎస్‌ఎస్‌బీ సిబ్బంది గమనించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమెను ఆపి పరిశీలించగా, ఆమె వద్ద ఎలాంటి వీసా లేదా పాస్‌పోర్టు పత్రాలు లేవని తేలింది. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న సిబ్బంది, స్థానిక పోలీసులకు అప్పగించారు.


పోలీసులు ఆమెను విచారించి కేసు నమోదు చేశారు. ఆమె వద్ద లభించిన ఒక చిన్న చీటి ఆధారంగా, సదరు మహిళ చైనాకు చెందిన హుజియా జీగా గుర్తించినట్లు నౌటన్వా పోలీసులు తెలిపారు. అయితే ఆమె చైనాలోని ఏ ప్రాంతానికి చెందినదన్న విషయం ఇంకా స్పష్టతకు రాలేదని, అలాగే భారత్‌లోకి రావడానికి గల అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేసినట్లు సమాచారం.

Huijia Ji
China woman arrested
Indo Nepal border
illegal border crossing
Maharajganj district
Uttar Pradesh
SSB
Nautanwa police
India China relations
border security

More Telugu News