Vasamshetti Subhash: దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించి నాశనం చేశారు: వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్

Vasamshetti Subhash Fires on YCP Over TTD Destruction Allegations
  • తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని మంత్రి ఆరోపణ
  • కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శ
  • ముక్కోటి ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని ఫైర్
  • గత ఐదేళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని తీవ్ర విమర్శలు
  • దేవుడిని రాజకీయాలకు వాడుకోవద్దని వైసీపీ నేతలకు మంత్రి హితవు
తిరుమల పవిత్రతను లక్ష్యంగా చేసుకుని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ ముష్కర మూక విష ప్రచారం చేస్తోందని, భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ తిరుమల క్షేత్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఇప్పుడు కూడా తమ నీచ రాజకీయాలను వీడటం లేదని ధ్వజమెత్తారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి సుభాష్ విమర్శించారు. దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించి, దర్శనాలను వ్యాపారంగా మార్చే వారిని పాలకమండలిలోకి తీసుకురావడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. గతంలో కొందరు నేతలు తమ అనుచరులతో కలిసి... డబ్బులు తీసుకుని 30-40 మందిని దర్శనాలకు తీసుకెళ్లిన ఘటనలు బహిరంగ రహస్యమని అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ వీఐపీ దర్శనాలను గణనీయంగా తగ్గించారని తెలిపారు.

ఇటీవల ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చినా, ఎక్కడా చిన్న అపశ్రుతి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్తర ద్వార దర్శనం జరిగిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఒక చిన్న ఫోటోను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు, వారి అనుబంధ మీడియా తొక్కిసలాట జరుగుతోందంటూ భయాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాయని, ఇది పూర్తిగా విష ప్రచారమేనని మండిపడ్డారు. శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలో చిన్న పొరపాటు జరిగినా హిందువులు తమ ఇంట్లో జరిగినట్టే భావిస్తారనే స్పృహ వైసీపీకి లేకపోవడం దారుణమన్నారు. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణలో బంగారం, నగదు పట్టుబడినప్పుడు నాటి ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం హిందూ ధర్మంపై ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు.

వైకుంఠ ఏకాదశి నాడు ప్రశాంతంగా జరిగిన దర్శన క్రమాన్ని చెడగొట్టేందుకు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు తిరుమలలో ఖాళీ బాటిళ్లు పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించారని మంత్రి సుభాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత భూమన ప్రెస్ ముందుకు వచ్చి ఏడుపు నటించడం సిగ్గుచేటన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. ద్రాక్షారామం, కపిలేశ్వర ఆలయాల్లో శాస్త్రబద్ధంగా జరిగిన పునఃప్రతిష్టలకు కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారని విమర్శించారు.

గత వైసీపీ హయాంలో ఆలయాల పేరుతో అక్రమ వసూళ్లు, నకిలీ ఖాతాలు, రథాల నిర్మాణం పేరుతో చెక్కుల దుర్వినియోగం జరిగాయని, విజిలెన్స్ విచారణలో అధికారులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. బంగారు చీరల వ్యవహారం, తలనీలాల స్కామ్, పరాకామణి దోపిడీ వంటి అనేక అవినీతి ఘటనలు వారి పాలనలోనే జరిగాయని, కోట్ల రూపాయల విలువైన తలనీలాలు అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులు కూడా ఉన్నాయని తెలిపారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆలయంలో ఫీడ్‌బ్యాక్ బుక్స్ ఏర్పాటు చేయగా 99 శాతం సానుకూల స్పందన వచ్చిందని మంత్రి చెప్పారు. ఈసారి దుర్గమ్మ ఆలయానికి 16 లక్షల మంది భక్తులు వచ్చినా, వీఐపీ దర్శనాలు తగ్గించడంతో తోపులాట లేకుండా దర్శనం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్, ఫాస్ట్‌ట్యాగ్ డేటా ఆధారంగా కుట్రదారులను క్షణాల్లో పట్టుకుంటున్నామని హెచ్చరించారు. 

ఇప్పటికైనా వైసీపీ నేతలు దేవుడి పట్ల భయం, భక్తితో వ్యవహరించాలని, ఆలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. ప్రజలు, దేవుడు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీకి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుణ్ని కోరుకుంటున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.


Vasamshetti Subhash
TTD
Tirumala
YCP
Chandrababu Naidu
Andhra Pradesh temples
Hinduism
Bhuma Karunakar Reddy
Tirumala Temple
AP Politics

More Telugu News