Vijay: విజయ్ 'జన నాయగన్' సినిమాకు సీఎం స్టాలిన్ మద్దతు... కేంద్రంపై తీవ్ర విమర్శలు

Vijay Jan Nayagan gets support from TN CM Stalin
  • సెన్సార్ బోర్డును కేంద్రం కీలుబొమ్మగా అభివర్ణించిన స్టాలిన్
  • దర్యాప్తు సంస్థల మాదిరి సీబీఎఫ్‌సీని కూడా కేంద్రం ఉపయోగించుకుటోందని విమర్శ
  • విజయ్ 'జన నాయగన్' చిత్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సినీ నటుడు విజయ్‌కి, ఆయన చిత్రం 'జన నాయగన్‌'కు మద్దతు తెలిపారు. సినిమా విడుదల ఆలస్యం కావడంపై వివాదం పెరుగుతున్న నేపథ్యంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)పై విమర్శలు గుప్పించారు. సెన్సార్ బోర్డును కేంద్రం కీలుబొమ్మగా అభివర్ణించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మాదిరిగానే ఈ సంస్థను కూడా రాజకీయ నియంత్రణ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

'జన నాయగన్‌' సినిమాకు సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ స్పందిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీని కూడా ఆయుధంగా ఉపయోగిస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

విజయ్ సినిమాకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. తమిళనాడుపై బీజేపీ తీసుకునే ఏ చర్యనైనా అన్ని పార్టీలు వ్యతిరేకించాలని లోక్‌సభ ఎంపీ జోతిమణి పిలుపునిచ్చారు. 

మరోవైపు, ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ జారీ చేయడంలో జాప్యం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే ఆరోపణలను బీజేపీ ఖండించింది. సెన్సార్ నియమ నిబంధనల ఆధారంగా బోర్డు సభ్యులు సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటారని, దీనిని రాజకీయ కోణంలో చూడవద్దని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు.
Vijay
Jan Nayakan
MK Stalin
Tamil Nadu politics
CBFC
Central Board of Film Certification
Nainar Nagendran

More Telugu News