ఫోన్‌పే నుంచి 'బోల్ట్'.. ఒక్క క్లిక్ తో వీసా, మాస్టర్‌కార్డ్ చెల్లింపులు!

  • వీసా, మాస్టర్‌కార్డ్ లావాదేవీల కోసం 'బోల్ట్' ఫీచర్‌ను ప్రారంభించిన ఫోన్‌పే
  • డివైస్ టోకెనైజేషన్ ద్వారా సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపులు
  • ప్రతిసారీ సీవీవీ నంబర్ ఎంటర్ చేయాల్సి రావడం నుంచి వెసులుబాటు
  • వ్యాపారుల యాప్ లోనే చెల్లింపులు.. లావాదేవీల డ్రాప్-అవుట్స్ తగ్గుదల
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే (PhonePe PG) తమ యూజర్ల కోసం ఒక కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం 'ఫోన్‌పే పీజీ బోల్ట్' పేరుతో కొత్త సదుపాయాన్ని శనివారం ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకే క్లిక్‌తో అత్యంత వేగంగా, సురక్షితంగా చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

ఈ కొత్త విధానం 'డివైస్ టోకెనైజేషన్' టెక్నాలజీపై పనిచేస్తుంది. యూజర్లు తమ వీసా లేదా మాస్టర్‌కార్డ్ వివరాలను ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి సేవ్ (టోకెనైజ్) చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే ఉన్న ఏ మర్చంట్ యాప్‌లోనైనా మళ్లీ మళ్లీ కార్డ్ వివరాలు ఎంటర్ చేయాల్సిన పనిలేదు. అదే డివైస్ లో చేసే తదుపరి లావాదేవీలకు సీవీవీ నంబర్ కూడా అడగదు. దీంతో చెల్లింపుల ప్రక్రియ చాలా సులభతరం అవుతుంది.

సాధారణంగా ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో యూజర్‌ను వేరే పేజీకి రీడైరెక్ట్ చేస్తుంటారు. 'బోల్ట్' ఫీచర్‌తో ఆ అవసరం ఉండదు. మొత్తం లావాదేవీ మర్చంట్ యాప్‌లోనే పూర్తవుతుంది. ఇది యూజర్‌కు సౌకర్యంగా ఉండటమే కాకుండా, లావాదేవీలు మధ్యలో ఆగిపోయే (డ్రాప్-అవుట్స్) సమస్యను తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనివల్ల వ్యాపారులకు లావాదేవీల సక్సెస్ రేటు కూడా పెరుగుతుంది.

ఈ సందర్భంగా ఫోన్‌పే మర్చంట్ బిజినెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "భారతీయులకు డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసే మా ప్రయాణంలో 'బోల్ట్' ఫీచర్ ఒక ముఖ్యమైన ముందడుగు. టోకెనైజేషన్ ద్వారా యూజర్లకు వన్-క్లిక్ అనుభవాన్ని అందిస్తున్నాం. ఇది యూజర్ల సౌకర్యాన్ని పెంచడంతో పాటు, మా మర్చంట్ భాగస్వాముల వ్యాపారాభివృద్ధికి కూడా దోహదపడుతుంది" అని వివరించారు.


More Telugu News