US Visas: వీసా ప్రీమియం ఫీజుల‌ పెంపు.. అమెరికా వెళ్లే భారతీయులపై ప్రభావం

USCIS Announces Premium Fee Hike Impacting Indian Visa Seekers
  • అమెరికాలో పెరిగిన ఇమ్మిగ్రేషన్ ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు
  • హెచ్‌-1బీ, ఎల్‌-1, ఓపీటీ వీసాలపై నేరుగా ప్రభావం
  • మార్చి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు 
  • భారతీయ విద్యార్థులు, టెక్కీలపై అధిక భారం
  • ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపిన యూఎస్‌సీఐఎస్
అమెరికాలో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయులకు ముఖ్య గమనిక. హెచ్‌-1బీ సహా పలు కీలక ఇమ్మిగ్రేషన్ సేవల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. పెంచిన ఈ ఫీజులు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులు, నిపుణులపై నేరుగా ప్రభావం చూపనుంది.

2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య నమోదైన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీజులను సవరించినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏజెన్సీ కార్యకలాపాలను మెరుగుపరచడానికి, వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి, పేరుకుపోయిన దరఖాస్తులను పరిష్కరించడానికి ఉపయోగిస్తామని వెల్లడించింది.

కొత్త ఫీజుల ప్రకారం హెచ్‌-1బీ, ఎల్‌-1, ఓ-1 వంటి కీలక వర్క్ వీసాలకు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల (రూ. 2.53 ల‌క్ష‌లు) నుంచి 2,965 డాలర్ల (రూ. 2.67 ల‌క్ష‌లు)కు పెరగనుంది. ఇదే ఫీజు ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్ పిటిషన్లకు (ఫామ్ I-140) కూడా వర్తిస్తుంది. విద్యార్థులకు సంబంధించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT), స్టెమ్-OPT దరఖాస్తుల ఫీజు 1,685 డాలర్ల (రూ. 1.52 ల‌క్ష‌లు) నుంచి 1,780 డాలర్ల (రూ. 1.60 ల‌క్ష‌లు)కి పెరిగింది. ఎఫ్-1, జే-1 విద్యార్థుల స్టేటస్ మార్పు దరఖాస్తుల ఫీజు 1,965 డాలర్ల (రూ. 1.77 ల‌క్ష‌లు) నుంచి 2,075 డాలర్ల (రూ. 1.87ల‌క్ష‌లు)కు చేరింది.

త్వరగా వీసా ప్రక్రియ పూర్తి కావాలని కోరుకునే దరఖాస్తుదారులు, కంపెనీలు సాధారణంగా ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఎంచుకుంటాయి. అమెరికాలో ఉపాధి ఆధారిత వీసాలు, ముఖ్యంగా హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌లో అత్యధిక లబ్ధిదారులు భారతీయులే. అలాగే, గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లోనూ, యూఎస్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు వినియోగించుకునే ఓపీటీలోనూ వీరి వాటానే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయం వారిపై అదనపు ఆర్థిక భారం మోపనుంది.
US Visas
USCIS
H1B Visa
Immigration
USA
Indian Students
OPT
Green Card
USCIS Fee Hike
L1 Visa
O1 Visa

More Telugu News