టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచితే కఠిన చర్యలు.. ప్రైవేట్ ట్రావెల్స్ కు ఏపీ రవాణా శాఖ వార్నింగ్

  • ఆర్టీసీ ధరల కన్నా 50 శాతం వరకు పెంచుకోవచ్చని వెల్లడి
  • అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • బస్సులలో రవాణాశాఖ హెల్ప్‌లైన్‌ నంబరు డిస్‌ప్లే చేయాలని ఆదేశాలు
సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా తీసుకుని ప్రయాణికులను నిలువు దోపిడీ చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులను ఏపీ రవాణా శాఖ హెచ్చరించింది. టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించవద్దని, ఆర్టీసీ ఛార్జీలకన్నా 50 శాతం గరిష్ఠంగా పెంచుకోవచ్చని తెలిపింది. అంతకుమించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. ధరల పెంపునకు సంబంధించి నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు.

ఈ నెల 18 వరకు అన్ని జిల్లాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభి బస్, రెడ్‌ బస్‌ వంటి యాప్‌ల ద్వారా కూడా ఆయా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఎంత టికెట్‌ ధరలు వసూలు చేస్తున్నాయో పర్యవేక్షిస్తున్నామని, అధిక ధరలు ఉంటే కేసులు పెడతామని చెప్పారు. అధిక ధరలు వసూలు చేస్తే ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబరు 9281607001ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెంబర్ ను అన్ని బస్సుల్లో డిస్ ప్లే చేసేలా ట్రావెల్స్ యజమానులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.


More Telugu News